Mon Dec 23 2024 02:19:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియాంక గాంధీ వస్తే కానీ.. తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ రాదా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తూ ఉంది. గ్రూపులతో సతమతమవుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అయినా సమస్యలు సమిసిపోయేలా చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఛరిష్మా ఉన్న నేత కోసం వెతుకుతూ ఉంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీని సవాలు చేయడానికి నెహ్రూ-గాంధీ కుటుంబ చరిష్మా అవసరమని పార్టీ భావిస్తోంది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని భావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఆమె అయితే బాగుంటుందని అంటున్నారు.
రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీతో తెలంగాణ రాష్ట్రంలో పలు పర్యటనలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తూ ఉంది. అందుకు సంబంధించిన ప్రణాళికను తెలంగాణ అగ్రనేతలు ఆమెతో చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ తన ప్రకటనలు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా సోనియాగాంధీ కుమార్తె హామీ ఇస్తుందనే సందేశం ప్రజలలోకి వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
తెలంగాణలో ప్రియాంక గాంధీ వారం నుంచి 10 రోజుల పాటు పాదయాత్ర చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారు. తెలంగాణలో పార్టీ ముఖంగా ప్రియాంక ఉండాలనే ఆలోచనకు మద్దతుగా పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలును కూడా రంగంలోకి దింపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని ప్రియాంక ప్రజలను కోరతారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నెరవేర్చడానికి ఆమెతో హామీ ఇప్పిస్తామని ఏఐసీసీ నేత తెలిపారు. కేసీఆర్ను సవాలు చేయడానికి ప్రియాంక గాంధీ వంటి ఛరిష్మా ఉన్న ముఖం కావాలని కాంగ్రెస్లోని చాలా మంది భావిస్తున్నారు. కేవలం యువత, రైతులకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం వల్ల ఓట్లు వస్తాయని అనుకుంటే సరిపోదన్నారు. తెలుగు ఓటర్లు పార్టీ సిద్ధాంతాలు లేదా పథకాలకు మాత్రమే కాకుండా బలమైన నాయకుల వైపు ఆకర్షితులవుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. గతంలో మర్రి చెన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వంటి వాళ్లు కాంగ్రెస్ ను గెలిపించుకున్నారని.. వారంతా చరిష్మా ఉన్న నాయకులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
Next Story