Sun Dec 22 2024 21:18:11 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లైన గంటకే విడాకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఇంతకీ ఆ పెళ్లికొచ్చిన అతిథి ఎవరో తెలుసా. అతని మొదటి భార్య. మనస్ఫర్దల కారణంగా మొదటి భార్య అతనికి..
పెళ్లి.. ఈ రోజుల్లో పెళ్లంటే బొమ్మలాటైపోయింది. పెళ్లెందుకు చేసుకుంటున్నారో కూడా తెలియట్లేదు చాలా మందికి. నచ్చినన్ని రోజులు కలిసి ఉండటం.. చిన్న చిన్న విషయాలకే విడిపోవడం. అసలు పెళ్లంటే ఏంటో.. మన ఇంట్లో ఉండే తాత- బామ్మలను అడిగితే చెబుతారు. నాతిచరామి అని ఇలా ప్రమాణం చేశాడో లేదో.. గంటకే భార్యకు విడాకులిచ్చేశాడు. ఇదంతా ఓ అనుకోని అతిథి ఆ పెళ్లికి వెళ్లడం వల్ల జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని సంభాలి జిల్లా అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో జరిగిందీ ఘటన.
ఇంతకీ ఆ పెళ్లికొచ్చిన అతిథి ఎవరో తెలుసా. అతని మొదటి భార్య. మనస్ఫర్దల కారణంగా మొదటి భార్య అతనికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె మండపానికి వచ్చి.. తాను బ్రతికి ఉండగా.. మరో పెళ్లి ఎలా చేసుకున్నావని భర్తను నిలదీసింది. భార్యకు నచ్చజెప్పేందుకు పెళ్లికొడుకు వేషధారణలో ఉన్న భర్త ప్రయత్నించినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. గొడవ పెద్దదైంది. విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడంతో.. పెళ్లికొడుకుని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇక్కడ అతని మొదటి భార్యతో పాటు.. అప్పుడే పెళ్లైన యువతికీ అన్యాయం జరిగింది.
ఇద్దరికీ న్యాయం జరిగేలా.. గ్రామ పెద్దలంతా కలిసి చర్చించి.. ఒక పరిష్కారం చేశారు. గంట క్రితమే పెళ్లాడిన యువతికి అతనితో విడాకులు ఇప్పించి.. ఆమెను అతని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన అందరికీ నచ్చడంతో అదే కానిచ్చారు. గంట క్రితం వివాహం చేసుకున్న అమ్మాయికి విడాకులిచ్చిన భర్త.. ఆమెను తన తమ్ముడికిచ్చి అక్కడే వివాహం జరిపించాడు. దీంతో పోలీసు కేసుల గొడవ లేకుండానే సమస్య పరిష్కారమైంది.
Next Story