Fri Apr 04 2025 21:05:52 GMT+0000 (Coordinated Universal Time)
Sivananda : ప్రయాగ్ రాజ్ లో 129 ఏళ్ల స్వామీజీ పుణ్యస్నానాలు..ఆరోగ్య రహస్యం ఏంటంటే?
ఈసారి ప్రయాగరాజ్ లో జరుగుతున్న ఒక కుంభమేళాకు ఒక విశిష్టత ఉంది. స్వామి శివానంద ఈ మహాకుంభమేళాకు వచ్చారు

ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా కొనసాగుతుంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎందరో స్వాములు, సంత్ లు, పీఠాధిపతులు, అఘోరాలు ఒక్కరేమిటి సన్యాసి లోకం మొత్తం అక్కడే ఉంది. ప్రయాగరాజ్ కు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మహా కుంభమేళాకు జనం పోటెత్తుతుండటంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంటికి రెప్పలా పోలీసు బృందాలు నిరంతరం కాపాడుతూనే ఉన్నారు. వైద్య బృందాలు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందిస్తున్నారు.
స్వామి శివానంద రావడంతో...
అయితే ఈసారి ప్రయాగరాజ్ లో జరుగుతున్న ఒక కుంభమేళాకు ఒక విశిష్టత ఉంది. స్వామి శివానంద ఈ మహాకుంభమేళాకు వచ్చారు. ప్రముఖ యోగా సాధకులు శివానంద రావడంతో ఆయనను చూసేందుకు భక్తులు ఎగబడుతున్నారు. ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. స్వామి శివానంద వయస్సు 129 ఏళ్లు కావడం నిజంగా విశేషమే. ఆయన శతాబ్దం నుంచి కుంభమేళాకు హాజరవుతూనే ఉన్నారు. ఆధార్ కార్డు ఆధారంగా స్వామి శివానంద వయస్సు ను నిర్ధారించి 129 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రతి కుంభమేళాకు హాజరవుతుండటం స్పెషాలిటీ. ఇప్పటికీ ఆయన హుషారుగానే ఉన్నారు. తన పని తాను చేసుకుంటూనే ఉన్నారు. అదీ ఆయన ప్రత్యేకత.
ఆహారపు అలవాట్లు ఏంటంటే?
ప్రయాగరాజ్ కు వచ్చిన స్వామి శివానందకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఆయన ఆగ్టు 8వ తేదీన 1896 లో జన్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. శివానంద సెక్టార్ లోని పదహారులో క్యాంప్ ను ఏర్పాటు చేశారు. స్వామి శివానందను చూసేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఉదయం ధ్యానం నుంచి ఆయన కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఆయన తన శిష్యగణంతో వచ్చి అక్కడ పుష్కర స్నానాలను ఆచరించారు. స్వామి కేవలం నూనె, ఉప్పులేని ఉడికించిన ఆహారం మాత్రమే తీసుకుంటారు. పాలపదార్ధాలకు దూరంగా ఉంటారు. రాత్రి తొమ్మిదింటికి నిద్రపోయి ఉదయం మూడు గంటలకు నిద్రలేదస్తారు. యోగా చేస్తారు. స్వామీజీ 129 ఏళ్లు బతకడంతో పాటు తన పనులు తానే చేసుకోవడం చూసి ఆయనను దైవ స్వరూపుడిగా భావించి ఆయన దర్శనం చేసుకోవడానికి భక్తులు ప్రయాగరాజ్ లో క్యూ కడుతున్నారు.
Next Story