Mon Dec 23 2024 03:29:21 GMT+0000 (Coordinated Universal Time)
జ్ఞానవాపి మసీదు: శిలా శాసనాలు తెలుగులో!!
ఉత్తరప్రదేశ్లోని వారాణసీ జిల్లాలో ఉన్న కాశీవిశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు
ఉత్తరప్రదేశ్లోని వారాణసీ జిల్లాలో ఉన్న కాశీవిశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో హిందూ దేవతల విగ్రహాలు బయటపడ్డాయి. వీటితో పాటు తెలుగు లిపితో ఉన్న ఒక శిలా శాసనాన్ని కూడా భారత పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీశారు. మైసూరులోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. ఎపిగ్రఫీ విభాగం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై మూడు తెలుగు శాసనాలను కనుగొంది. ఏఎస్ఐ డైరెక్టర్ (ఎపిగ్రఫీ) కె.మునిరత్నం రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న మూడు శాసనాలతో సహా 34 శాసనాలను విడదీసి, కాశీ విశ్వనాథ దేవాలయం ఉనికిపై నివేదికను సమర్పించింది. 17వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో నారాయణ భట్టు కుమారుడు మల్లన భట్టు వంటి వ్యక్తుల పేర్లను స్పష్టంగా ఉన్నాయని మునిరత్నం తెలిపారు.
నారాయణ భట్టు 1585లో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించిన తెలుగు బ్రాహ్మణుడు కావడం విశేషం. ఆ శిలాశాసనంపై ‘మల్లన్న భట్టు, నారాయణ భట్టు’ పేర్లు ఉన్నాయి. నారాయణ భట్టు కుమారుడే మల్లన్న భట్టు. వీరు తెలుగు బ్రాహ్మణులు. 1585లో పునర్నిర్మించిన కాశీవిశ్వనాథుని ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. 15వ శతాబ్దంలో జౌన్పూర్ సుల్తాన్ హుస్సేన్ షార్కి(1458-1505) కాశీవిశ్వనాథుని మందిరాన్ని కూల్చేశారు. తర్వాత కాలంలో రాజ్యం చేపట్టిన రాజా తోడరమల్లు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు. దక్షిణ భారత దేశానికి చెందిన నిపుణులైన నారాయణ భట్టును సంప్రదించి ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారని చరిత్రకారులు చెబుతుంటారు. నారాయణ భట్టు పర్యవేక్షణలోనే కాశీ విశ్వనాథుని మందిరం పునర్నిర్మితమైంది.
జ్ఞానవాపి మసీదు గోడపై తెలుగు భాషలో రాసినా.. అది పాడైపోయి అసంపూర్తిగా ఉందని తెలుస్తోంది. అందులో మల్లన భట్లు, నారాయణ భట్లు అని ఉన్నాయని ఏఎస్ఐ డైరెక్టర్ తెలిపారు. మసీదు లోపల దొరికిన రెండవ తెలుగు శాసనం మీద ‘గోవి’ గురించి ప్రస్తావించింది. గోవి అంటే.. గోవులు, గొర్రెల కాపరులు. మూడవ శాసనం, 15వ శతాబ్దానికి చెందినది. మసీదుకు ఉత్తరం వైపున ఉన్న ప్రధాన ద్వారం వద్ద ASI నిపుణులు కనుగొన్నారు. ఇందులో 14 లైన్లు ఉన్నాయి, అవి పూర్తిగా అరిగిపోయాయి, దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. చాలా వివరాలు కనిపించకుండా పోయాయని మరొక నిపుణుడు చెప్పారు. తెలుగుతో పాటు కన్నడ, దేవనాగరి, తమిళ భాషల్లో కూడా శాసనాలు ఉండేవని అధికారులు వివరించారు.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని వజూఖానా సీల్ ను తొలగించాలని కోరుతూ హిందువులు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివలింగానికి హాని కలగకుండా వజూఖానాలో సర్వే చేపట్టేందుకు ఏఎస్ఐని అనుమతించాలని కోరారు. తవ్వకం, ఇతర శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఏఎస్ఐ సర్వే చేపట్టాలి. శివలింగం ప్రాంతం చుట్టూ అసలు భవనంతో సంబంధం లేకుండా ఆధునిక నిర్మాణం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంతో ముస్లింలకు ఎటువంటి మతపరమైన ప్రాముఖ్యత లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. వజూఖానాకు సీల్ వేయాలని 2022లో సుప్రీంకోర్టు ఉత్వర్వులిచ్చింది.
Next Story