Sun Dec 22 2024 19:19:28 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్యలో తలుపులు చేసింది మనోళ్లే
అయోధ్యలో రామమందిరం ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది. రామమందిరానికి ఉపయోగించిన తలుపులు హైదరాబాద్లో తయారయినవే
అయోధ్యలో రామమందిరం ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది. వచ్చే నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ సన్నాహాలు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు అయోధ్య చేరుకునేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. అయోధ్యలో రాములోరిని చూసేందుకు తండోపతండాలుగా జనం వస్తుండటం, వీవీఐపీల రాక కూడా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని ఆలయ సమీపంలోకి అనుమతించడం లేదు.
అనూరాధ టింబర్ డిపోలో...
అయితే అయోధ్యలోని రామమందిరంలో ఉపయోగించే తలుపులు హైదరాబాద్ లోనే తయారయినవి కావడం విశేషం. హైదరాబాద్ న్యూ బోయినపల్లిలోని అనూరాధ టింబర్ డిపోలో ఈ తలుపులు తయారు చేయించారు. గత ఏడాది జూన్ నుంచి తలుపుల తయారీ పనులు ప్రారంభమయ్యాయి. అప్పడి నుంచి ఇక్కడే ఉండి తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు అరవై మంది కళాకారులు ఈ తలుపులను తయారు చేశఆరు. ఈ తలుపుల తయారీకి బలార్షా టేకును ఉపయోగించారని అనూరాధ టింబర్ డిపో నిర్వాహకులు తెలిపారు.
వివిధ కళాకారుల....
టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు మాట్లాడుతూ తమకు ఈ అవకాశం లభించడం అదృష్టమని చెప్పారు. తలుపుల తయారీలో నాణ్యమైన కలపను ఉపయోగించామని ఆయన తెలిపారు. శిల్పాకళా నైపుణ్యంతో అనేక మంది కళాకారులు ఈ తలుపుల తయారీలో పాల్గొన్నారన్న ఆయన తలుపులను చూసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కూడా ప్రశంసించారని తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి హైదరాబాద్ లో తలుపులు తయారు చేయించడం గర్వకారణంగా ఉందని టింబర్ డిపోలో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. టెండర్ ద్వారా తమకు ఈ అవకాశం దక్కిందని ఆయన తెలిపారు.
Next Story