Thu Dec 26 2024 16:49:22 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో రష్ తగ్గలేదుగా.. మంగళవారం కూడా.. పెళ్లిళ్ల సీజన్ వల్లనేనా?
తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మంగళవరం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి గంటల సమయం పడుతుంది.
తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మంగళవరం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి గంటల సమయం పడుతుంది. తిరుమలకు వరస సెలవులు రావడంతో నిన్నటి వరకూ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే మంగళవారం కూడా అదే రద్దీ కొనసాగుతుంది. సాధారణంగా మంగళవారం, బుధవారం, గురువారాలు భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందని, కానీ ఈ వారం మాత్రం వారంతో సంబంధం లేకుండా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులు అధికంగా వస్తుండటంతో హుండీ ఆదాయం కూడా ఈ నెల భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి రద్దీ ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు రావడంతో పాటు శ్రావణమాసం కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు.
దర్శనానికి...
దీంతో పాటు శ్రావణమాసంలో పెళ్లిళ్లు జరుగుతుండటంతో కొత్త జంటలు కూడా స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకునేందుకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకున్న వారు నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుండగా, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,595 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,981 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు
Next Story