Sun Dec 22 2024 11:05:12 GMT+0000 (Coordinated Universal Time)
Diwali : నేడు వెలుగుల దీపావళి..ఆనంద కేళి
నేడు దీపావళి పండగ. వెలుగుల పండగగా భావించే దీపావళి నేడు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
నేడు దీపావళి పండగ. వెలుగుల పండగగా భావించే దీపావళి నేడు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అమావాస్య రోజున వచ్చే దీపావళి రోజున ఉదయాన్నే స్నానమాచరించి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఇళ్లలోనూ లక్ష్మీదేవి పూజలు చేస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసి వండి ప్రసాదంగా పంచుతారు. ఈ పండగకు టపాసులు సాయంత్రం వేళ ఎంత ముఖ్యమో తీపి చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. పేదా,బిక్కీ తేడా లేకుండా ఈరోజు ప్రతి ఇళ్లలో మిఠాయిలు తయారు చేసుకుంటారు. ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది స్వీట్ షాపుల నుంచి కొనుగోలు చేసి పని భారం తగ్గించుకుంటున్నారు.
లక్షీ దేవిని పూజతో...
లక్ష్మీపూజ చేస్తారు. తమకు తమ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటారు. ఉదయాన్నే లేచి తలారా స్నానమాచరించి శుద్ధిగా వంటలు చేసి లక్ష్మీదేవికి సమర్పించుకుంటారు. రాక్షసుడు నరకాసురుడిని సత్యభామ వధించిన రోజు కావడంతో అందరూ ఆనందంగా ఈ పండగ చేసుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఇంటిల్లిపాది ఒకచోట చేరి వేడుకగా ఈ పండగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి అంటేనే చిన్నారుల నుంచి పెద్దల వరకూ తెలియని హుషారు. అందుకే దీపావళికి ఉన్న ప్రత్యేకత మరే పండగకు ఉండదు. పండగకు కొత్త అల్లుళ్లు రావడంతో ఇల్లు కళకళలాడిపోతుంది.
సాయంత్రానికి...
ఇక సాయంత్రం అయ్యేసరికి వెలుగులు నిండిపోతాయి. ఇంటి నిండా దీపాలతో అలంకరిస్తారు. టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. బాణా సంచా కాలుస్తూ రాత్రి పది గంటల వరకూ కుటుంబ సభ్యులందరూ ఆనందంతో గడుపుతారు. దీపావళి అంటే సత్యభామ నరకాసురుడిని వధించిన రోజు కావడంతో రాక్షస సంహారం జరిగిందని భావించి పూర్వ కాలం నుంచి దీపావళిని ఘనంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఈరోజు కూడా దేశమంతా వెలుగులతో నిండిపోతుంది. అయితే కాలుష్యం పెరిగిపోతుందని ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ ఈ పండగ ముందు ఆ విమర్శలు.. ఆ మాటలను పక్కన పెట్టి మరీ దీపావళి పండగను జరుపుకోవడం అందరికీ ఇష్టం. వ్యాపారులు ఇది తమ తొలి సంవత్సరంగా భావించి దుకాణాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Next Story