Fri Dec 20 2024 07:00:34 GMT+0000 (Coordinated Universal Time)
Bangalore : చెత్త కుండీలో 25 కోట్లు
చిత్తుకాగితాలు ఏరుకునే సాల్మన్ కు బెంగళూరులో చెత్త కుప్పలో 25 కోట్ల రూపాయలు దొరికాయి
చెత్తకుప్పను ఎవరైనా చీదరించుకుంటారు. ముక్కుమూసుకుని దాని పక్క నుంచి వెళ్లేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ ఆ చెత్త కుప్పలో 25 కోట్ల రూపాయలు దాగి ఉంటాయని ఎవరికి మాత్రం తెలుసు. అందుకే చెత్తను కూడా తేలిగ్గా తీసిపారేయడానికి వీలులేదని బెంగళూరులో జరిగిన ఘటన రుజువు చేస్తుంది. రోడ్డు పక్కన చిత్తుకాగితాలు ఏరుకునే సాల్మన్ కు బెంగళూరులో చెత్త కుప్పలో 25 కోట్ల రూపాయలు దొరికాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో .. ఆ పక్క నుంచే వెళ్లిన తమకు ఆ కోట్లు ఎందుకు దక్కలేదని మధనపడే వారు ఎందరో కనపడుతున్నారు.
చెత్త సేకరిస్తుండగా...
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎస్.కె. సాల్మన్ చెత్త కాగితాలను సేకరిస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. అయితే బెంగళూరులోని అమృతహళ్లిలో చెత్తను ఏరుకుంటుండగా ఒక సంచి దొరికింది. ఆ సంచిని మామూలుగా ఇంటికి తీసుకెళ్లాడు సాల్మన్. అయితే అందులో ఏముందోనని చూడగా 23 కట్టలున్న డాలర్స్ కనిపించాయి. అయితే అవి డాలర్లు అని తెలియని సాల్మన్ తాను కాగితాలు విక్రయించే వ్యాపారికి చూపించాలనుకున్నాడు. ఈ విషయం చెప్పినా ఆయన ఊర్లో లేకపోవడంతో తాను వచ్చిన తర్వాత చూస్తానని చెప్పాడు.
రిజర్వ్ బ్యాంకుకు...
కానీ సాల్మన్ భయపడి పోయి తనకు తెలిసిన కరీముల్లాను కలిసి అసలు విషయం చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ కు తెలియజేడంతో అవి డాలర్లుగా తేల్చారు. మొత్తం 25 కోట్ల రూపాయల విలువ చేసే డాలర్లు కావడంతో కమిషనర్ సయితం ఆశ్చర్యపోయాడు. అయితే ఈ డాలర్లు నకిలీవా? అసలైనవా? అన్నది పోలీసులు చెక్ చేస్తున్నారు. వాటిని పరిశీలన కోసం రిజర్వ్బ్యాంకుకు పంపారు. మొత్తం మీద 25 కోట్ల విలువైన నగదు దొరికినా భయపడి పోలీసులకు సాల్మన్ అప్పగించడాన్ని అందరూ అభినందిస్తున్నారు.
Next Story