Mon Dec 23 2024 09:45:28 GMT+0000 (Coordinated Universal Time)
విజృంభిస్తోన్న టైప్ 2 డెంగ్యూ.. 4 రోజుల్లో ఐదుగురి మృతి
జ్వరంతో మరణించేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. టైప్ 2 డెంగ్యూ కేసులు..
వర్షాకాలం మొదలైతే చాలు.. సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. ముఖ్యంగా జలుబు, జ్వర పీడితుల సంఖ్య పెరిగి.. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతుంటాయి. కొద్దిరోజులుగా కేరళలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజులుగా అక్కడ వందలాది టైప్ 2 డెంగ్యూకేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన నాలుగురోజుల్లో టైప్ 2 డెంగ్యూ లక్షణాలతో ఐదుగురు మరణించగా.. 309కి పైగా కొత్తకేసులు నమోదైనట్లు వివరించారు.
గత నెలలో డెంగ్యూ కారణంగా 23 మంది మరణించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకూ డెంగ్యూ జ్వరంతో 10 మరణాలే నమోదయ్యాయి. జ్వరంతో మరణించేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. టైప్ 2 డెంగ్యూ కేసులు పేరుతున్న నేపథ్యంలో కొల్లం, కోజికోడ్ జిల్లాలను డెంగ్యూ హాట్స్పాట్లుగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో డెంగ్యూ నిర్థారణ పరీక్షలను వేగవంతం చేశారు. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3,409 కేసులు నమోదవ్వగా.. మరో 10,038 అనుమానిత జ్వర కేసుల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డెంగ్యూనే కాకుండా ర్యాట్ ఫీవర్, స్క్రబ్ టైఫస్ వంటి సీజనల్ జ్వరాలు, వ్యాధులు కూడా నిర్ధారణ అవుతుండటం కేరళ ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లల విషయం జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.
Next Story