ఉత్తమ్‌కు కీలక బాధ్యతలు.. అభ్యర్థుల ఖరారు ఆయన చేతుల్లోనే..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, వివిధ రాష్ట్రాల..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు హైకమాండ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీపీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అనంతరం పార్టీలో సీనియర్లు కొంత అసౌకర్యంగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఆయన పార్టీ వీడి వెళ్లిపోతున్నారంటూ ఇటీవల నుంచి పుకార్లు షికార్లు అవుతున్నాయి. తాను పార్టీ మారేది లేదని చెప్పినా ప్రచారం మాత్రం జోరుగా సాగుఉతోంది. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తికి గురవుతున్నారని కమిటీలో చోటు కల్పించారు.
ఇదంతా తనను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న దుష్ప్రచారంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు ఈ తరహా దుష్ప్రచారాలు చేస్తూ తమ అవకాశాలను దెబ్బతీయాలని చూస్తుంటాయని ఉత్తమ్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది. గాంధీ కుటుంబం పట్ల ఆయన ప్రదర్శించే విధేయత.. ఆయనపై ఆ కుటుంబం విశ్వసనీయత ఇప్పుడు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటు సంపాదించేలా చేసిందనే చెప్పాలి.
16 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ..
1. మల్లికార్జున్ ఖర్గే
2. సోనియా గాంధీ
3. రాహుల్ గాంధీ
4. అంబికా సోని
5. అధిర్ రంజన్ చౌదరి
6. సల్మాన్ ఖుర్షీద్
7. మధుసూదన్ మిస్త్రీ
8. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
9. టీఎస్ సింగ్ దేవ్
10. కేజే జియోగ్రే
11. ప్రీతమ్ సింగ్
12. మహ్మద్ జావేద్
13. అమీ యాజ్ఞిక్
14. పిఎల్ పునియా
15. ఓంకార్ మార్కం
16. కేసీ వేణుగోపాల్