Sun Dec 22 2024 08:03:05 GMT+0000 (Coordinated Universal Time)
Uniform Civil Code : ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అమలులో అందరికంటే ముందుంటుందా?
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టారు
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఈబిల్లును ప్రవేశపెట్టడం విశేషం. అసెంబ్లీ ముందుకు వచ్చిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఈ బిల్లు ఆమోదం పొందితే మాత్రం దేశంలో తొలిసారి ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుందని చెప్పక తప్పదు. అయితే ఈ బిల్లులో అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. సహజీవనం లో ఉన్న వారికి పుట్టిన పిల్లలకు కూడా చట్టపరమైన గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.
రెండేళ్లు అధ్యయనం చేసి...
పుష్కరసింగ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ దాదాపు రెండేళ్లు అధ్యయనం చేసిన తర్వాత ఇటీవల నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ 2.33 లక్షల మంది నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరించింది. అరవై వేల మందితో మాట్లాడి మొత్తం 749 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించంది. ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి వస్తే మతాలకు సంబంధం లేకుండా అందరికీ ఒకే విధానమైన వివాహ చట్టాలు అమలవుతాయి. విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు కూడా అందరికీ ఒకేలా వర్తిస్తాయి. ఇందులో ఇతర అంశాలతో పాటు, లివ్-ఇన్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లలకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.
సహజీవనం చేసే వారు...
అయితే సహజీవనం చేసే వారి వయసు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఉత్తరాఖండ్ వాసులు ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి అని ఈ బిల్లులో పేర్కొన్నారు. అయితే నైతికతకు, పౌరచట్టాలకు విరుద్ధంగా ఉన్న సంబంధాలను మాత్రం రిజిస్ట్రేషన్ చేయరు. సహజీవనం చేసే వాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు వస్తే వారి వివరాలను పరిశీలించి, అనుమతి ఇవ్వడానికి ఒక వెబ్సైట్ ను సిద్ధం చేస్తారు. ఈ వెబ్సైట్ లో నమోదు చేసిన జంటల వివరాలు జిల్లా రిజిస్ట్రార్ ధృవీకరిస్తారు. సహజీవనం చేస్తున్న వారితో మాట్లాడిన తరవ్ాతనే దానికి సంబంధించిన అనుమతులు మంజూరు చేస్తారు. తప్పుడు సమాచారం ఇస్తే మూడు నెలల జైలు శిక్ష, ఇరవై ఐదు వేల జరిమానాను కూడా విధించే విధంగా బిల్లును రూపొందించారు.
Next Story