Mon Dec 23 2024 06:11:06 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. యూపీలో హై అలెర్ట్
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో యూపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కీలక నిర్ణయం తీసుకుంది
ప్రస్తుతం భారత్ తో పాటు ప్రపంచదేశాలను వణికిస్తున్న మహమ్మారి ఒమిక్రాన్. కరోనా డెల్టా వేరియంట్ కన్నా ఇది 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వేరియంట్ ప్రారంభమైన దక్షిణాఫ్రికాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దానితో పాటు 57 దేశాలకు ఈ వైరస్ శరవేగంగా వ్యాపించింది. ఇటు భారత్ లోనూ ఇప్పటి వరకూ 25 వరకు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. ఏపీలో కూడా మొదటి కేసు నమోదవ్వడంతో రాష్ట్ర ప్రజలు గుబులు చెందుతున్నారు.
యూపీ ప్రభుత్వం....
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో యూపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర రాజధాని అయిన లక్నోలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో అక్కడ 144 సెక్షన్ వెంటనే అమల్లోకి వచ్చింది. జనవరి 5,2022 వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉండనున్నాయి.
యాభై శాతం మాత్రమే....
సీఎం ఆదేశాల మేరకు.. ఇకపై యూపీలో రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, జిమ్‌లు, స్టేడియంలను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే తెరుచుకోనున్నాయి. అలాగే ఎలాంటి శుభ, అశుభ కార్యక్రమాల్లో 100 మంది కంటే ఎక్కువ పాల్గొనరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటి నుంచి బయటికి వచ్చే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల్లోనూ...
క్రిస్మస్, డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకల సమయంలోనూ ఈ ఆంక్షలు వర్తిస్తాయని, కోవిడ్ ప్రోటోకాల్ ను ప్రతిఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంలో పోలీసులు కూడా మాస్కులు ధరించి, రెండు గజాల దూరం పాటించాలని ఆదేశాలిచ్చింది. కోవిడ్, ఒమిక్రాన్ ల వ్యాప్తిపై సోషల్ మీడియాల్లో పుకార్లు వ్యాప్తి చేయడం, అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు.
Next Story