Mon Dec 23 2024 23:26:47 GMT+0000 (Coordinated Universal Time)
అట్లుంటదీ మరి.. టమాటాలకు బౌన్సర్లు
కొందరైతే టమాటాలను కొనే పరిస్థితి లేక టమాటా పండించే తోటల్లో, టమాటా దుకాన్లలో వాటిని లూటీ కూడా చేస్తున్నారు. ఇటీవల..
దేశవ్యాప్తంగా టమాటాల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుల్లని టమాటా ఘాటెక్కింది. కనీసం రెండొందలైనా లేనిదే.. కూరలోకి రానని మొండకేస్తుంది. దేశవ్యాప్తంగా కిలో టమాటా రూ.120 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ను బట్టి రూ.250 కూడా ధర పలుకుతోంది. కొందరైతే టమాటాలను కొనే పరిస్థితి లేక టమాటా పండించే తోటల్లో, టమాటా దుకాన్లలో వాటిని లూటీ కూడా చేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని ఓ రైతుకి చెందిన పొలంలో రూ.3 లక్షల విలువ చేసే టమాటాలను దొంగిలించడం కలకలం రేపింది. ధర పెరిగినపుడు టమాటాలు చోరీకి గురికావడంతో ఆ రైతు లబోదిబోమన్నాడు. ఈ క్రమంలో ఓ కూరగాయల వ్యాపారి టమాటాలకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకున్నాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో వెలుగుచూసింది.
అజయ్ ఫౌజీ అనే కూరగాయల వ్యాపారి చేసిన ఈ వినూత్న ప్రయోగం సర్వత్రా చర్చనీయాంశమైంది. టమాటాల ధర ఎక్కువగా ఉండటంతో.. కొనుగోలు దారుల నుంచి తన దుకాణంలో ఉంచిన టమాటాలను కాపాడుకునేందుకే బౌన్సర్లను పెట్టుకున్నట్లు అజయ్ వివరించారు. కూరగాయలు కొనేందుకు వచ్చేవారు టమాటాలను దొంగిలిస్తున్నారని, కొన్నిసార్లైతే.. వాటికోసం కొట్టుకుంటున్నారని కూడా చెప్పాడు. అలాంటి వారి బారి నుంచి టమాటాలను కాపాడుకునేందుకు బౌన్సర్లను పెట్టుకున్నానని తెలిపాడు. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.160 ఉండటంతో.. ప్రజలు 50 గ్రాములు, 100 గ్రాముల చొప్పున మాత్రమే కొంటున్నారని చెప్పాడు.
Next Story