Tue Nov 05 2024 16:48:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో పలు రంగాలకు చెందిన నలుగురిని నామినేట్ చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో విజయేంద్ర ప్రసాద్తో పాటు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా, పరుగుల రాణి పీటి ఉష, వీరేంద్ర హెగ్డేలను ఎన్డీఏ సర్కారు రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయేంద్ర ప్రసాద్ సినీ రంగానికి చేసిన కృషిని ప్రశంసించారు. దశాబ్దాలుగా సినీ రంగానికి విజయేంద్ర ప్రసాద్ సేవలందిస్తున్నారని.. విజయేంద్ర ప్రసాద్ చేసిన కృషి వల్ల భారత సంస్కృతి విశ్వవ్యాప్తమైందని కూడా మోదీ తెలిపారు.
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నలుగురు కూడా దక్షిణాదికి చెందిన వారే కావడం విశేషం. ఇళయరాజా(తమిళనాడు), విజయేంద్ర ప్రసాద్(తెలుగు వ్యక్తి), పీటీ ఉష(కేరళ), వీరేంద్ర హెగ్డే(కర్ణాటక)ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇళయారాజా సంగీతం అనేక తరాలకు వారధిగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. ఆయన సంగీతం అనేక భావాలకు ప్రతిబింబం అని అన్నారు. పీటీ ఉష జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శంగా నిలిచిందని మోదీ అన్నారు. అనేక సంవత్సరాలుగా ఎందరో క్రీడాకారులను పీటీ ఉష తయారు చేశారని కొనియాడారు. వీరేంద్ర హెగ్డే సమాజసేవలో ముందున్నారని.. ఆరోగ్యం, విద్య కోసం విశేష కృషి చేస్తున్నారని మోదీ ప్రశంసించారు.
Next Story