Mon Dec 23 2024 03:33:56 GMT+0000 (Coordinated Universal Time)
రాత్రి 7 గంటలైతే.. ఆ ఊర్లో టీవీలు, సెల్ఫోన్లు బంద్.. ఎందుకో తెలుసా ?
ఆగస్టు 15న గ్రామంలోని మహిళలు అందరితో సమావేశమయ్యారు. రోజూ రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల మధ్య టీవీలు, సెల్ఫోన్లు ..
కరోనా సమయంలో స్కూళ్లు, కాలేజీలు మూత పడటంతో.. చాలా వరకూ ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే చాలా మంది విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు కొనిచ్చారు. కానీ పిల్లలు వాటిని అవసరానికి మించి వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లకు బానిసలై చదువును చెట్టెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ గ్రామ సర్పంచ్ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా.. కాడేగావ్ మండలంలోని మోహిత్యాంచె వడ్గావ్ గ్రామ జనాభా 3,105. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ పాఠాలు వినేందుకు పిల్లలకు తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లు కొనిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ స్కూళ్లు తెరిచాక పిల్లలు మొబైల్ ఫోన్ తోనే కనిపించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. మహిళలేమో పిల్లల గురించి పట్టించుకోకుండా టీవీ సీరియళ్లు చూడడంలో మునిగిపోయేవారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని, పిల్లల భవిష్యత్ నాశనమవుతుందని భావించారు గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే.
ఆగస్టు 15న గ్రామంలోని మహిళలు అందరితో సమావేశమయ్యారు. రోజూ రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల మధ్య టీవీలు, సెల్ఫోన్లు ఆఫ్ చేయాలని తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ సభ్యులకు అప్పగించారు. అప్పటి నుంచి రోజూ రాత్రి ఏడు గంటలు కాగానే సైరన్ మోగుతుంది. వెంటనే మొబైల్స్ ఆఫ్ అయిపోతాయి. టీవీలు మూగబోతాయి. పిల్లలు హోమ్ వర్క్ చేసుకుని చదువుకుంటారు. తొలుత ఈ నిబంధనతో ఇబ్బంది పడినా.. రోజులు గడిచే కొద్దీ దానికి అలవాటు పడిపోయారు. సర్పంచ్ విజయ్ మోహితే తీసుకున్న ఈ నిర్ణయాన్ని చుట్టుపక్కల గ్రామస్తులు కొనియాడుతున్నారు.
Next Story