Fri Nov 22 2024 19:03:07 GMT+0000 (Coordinated Universal Time)
Bengaluru : బెంగళూరు కథ ముగిసినట్లేనా.. దీనికి అంతటికీ కారణం అదేనా? కార్లు కడిగినా ఫైనేనట
బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి తీవ్రమయింది. అదే పరిస్థితి హైదరాబాద్ కు వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు
అవును.. సామర్థ్యానికి మించి జనాభా పెరిగితే ఏ నగరమైనా తట్టుకుంటుందా? చిన్న పాటి వాహనంలో ఎక్కువ మంది ప్రయాణిస్తేనే అది మొరాయిస్తుంది. వాహనమైనా.. నగరమైనా ఒకటే.. హైదరాబాద్ కంటే ముందు బెంగళూరు నగరం ఒక కూల్ ప్లేస్. చాలా మంది బెంగళూరులో సెటిల్ అవ్వాలని కలలు కనే వారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వలస వెళ్లారు. అక్కడ వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు. ఇక ఉద్యోగ విరమణ చేసిన వాళ్లు కూడా 1980 దశకం నుంచి 1990వ దశకం వరకూ ఏపీ నుంచి ఎక్కువగా బెంగళూరుకే ప్రధమ ప్రాధాన్యత ఇచ్చేవారు.
కూల్ వెదర్ కావడంతో...
మన భాష కాకపోయినా.. కూల్ వెదర్ ఉండటంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం.. తాగేందుకు స్వచ్ఛమైన నీరు లభిస్తుందని అక్కడకు క్యూ కట్టారు. ఇప్పుడు బెంగళూరు నగరాన్ని పరిశీలించిన వారికి ఎవరికైనా సరే... కన్నడ భాష కంటే తెలుగు మాట్లాడే వాళ్లు ఎక్కువగా వ్యాపార రంగాల్లో కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. చిన్న చిన్న దుకాణాల నుంచి హోటళ్లు, మెస్‌లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా ఒక్కటమిటి.. బెంగళూరు సిటీ అంతా మనోళ్లే. భాష వారి వ్యాపారాలకు అడ్డుకాలేదు. బెంగళూరు అందరినీ ఆదరించింది. దీంతో పాటు 1990 వ దశకం నుంచి ఐటీ రంగం విస్తరించడం ప్రారంభమయింది. ఇక చూడాలి నా సామిరంగా.. వరసబెట్టి అన్ని కంపెనీలు బెంగళూరుకు క్యూ కట్టాయి.
సాఫ్ట్వేర్ కంపెనీల రాకతో...
సాఫ్ట్వేర్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు పొందారు. విదేశాల్లో ఉన్న వారు సయితం తమ చివరి మజిలీని బెంగళూరుగానే ఎంచుకున్నారు. తర్వాత హైదరాబాద్ కూడా అదే ఐటీ రంగానికి అడ్రస్‌గా మారడంతో కొంత వత్తిడి తగ్గింది. ఇప్పుడు బెంగళూరులో మంచినీటి ఎద్దడి.. మంచినీరే కాదు.. నీటి ఎద్దడి తలెత్తింది. మూడు దశాబ్దాల నుంచి ఎప్పుడూ లేని పరిస్థితి వచ్చింది. చివరకు ఐదు రోజులకు స్నానాలు చేయాల్సిన స్థితికి బెంగళూరు వాసులు వచ్చారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆన్ లైన్ లోనే విద్యాబోధన చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. నీటి కొరత ప్రభావం పర్యాటక రంగంపై కూడా పడింది. బెంగళూరు నగరానికి ప్రతి రోజు 2800 మిలియన్ లీటర్స్ మంచినీరు అవసరమవుతుంటే కేవలం 1300 మిలియన్ లీటర్స్ ను మాత్రమే సరఫరా అవుతుంది.
కారు కడిగినా...
నీటిని వృధా చేస్తే జరిమానా కూడా విధిస్తున్నారు. నీటిని వృధా చేసినట్లు తెలిస్తే ఐదువేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పదే పదే నిబంధనను ఉల్లంఘిస్తే ఐదు వేలకు తోడు మరో ఐదు వందలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక కార్లను కూడా నీటితో శుభ్రం చేయడానికి వీలులేదని షరతులు పెట్టారు. కేవలం తడిగుడ్డతోనే వాహనాలను తుడుచుకోవాలంటూ సలహాలు ఇచ్చేశారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడం, లెక్కకు మించి అపార్ట్మెంట్ల నిర్మాణం జరగడం, నీటి వినియోగానికి సరిపడా భూగర్భ జలాలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. బెంగళూరులో భారీ వర్షాలు కురిస్తేనే ఈసమస్య నుంచి బయట పడే అవకాశాలున్నాయంటున్నారు. అప్పటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రతి బొట్టును వాడేటప్పుడు ఆలోచించి వాడాలంటూ ప్రసారమాధ్యమాల ద్వారా ప్రభుత్వం ప్రజలను హెచ్చరించాల్సిన పరిస్థితి తలెత్తింది.
హైదరాబాద్ కూడా...?
బెంగళూరుకు కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరుకు ఐటీ పరిశ్రమలు వెళ్లకుండా కేవలం బెంగళూరునే ఎంచుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మైసూరు వంటి నగరాలను నాటి పాలకులు పారిశ్రామకపరంగా అభివృద్ధి చేసుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. భవిష్యత్ లో హైదరాబాద్ కు కూడా ఆ పరిస్థితి రాదన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పటికే హైదరాబాద్ జనాభా కోటి దాటింది. భవిష్యత్ లో మరింత జనాభా పెరిగే అవకాశముంది. నీటి సరఫరా కోసం ప్రస్తుత ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్‌కు కూడా భవిష్యత్ లో నీటి ఎద్దడి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో.. బెంగళూరును చూసైనా నేర్చుకుని మన పాలకులు సరైన చర్యలు తీసుకుని నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. సో.. హైదరాబాద్ వాసులు కూడా నీటిని దుర్వినియోగం చేయకుండా.. ప్రతి బొట్టును అవసరాలకే వినియోగించుకోవాలన్న సూచనలు వెలువడుతున్నాయి.
Next Story