Mon Dec 23 2024 10:27:57 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka : బెంగలూరులో ముదిరిన నీటి సంక్షోభం.. ఎంతగా అంటే.. టాయ్‌లెట్ కు వెళ్లాలన్నా?
బెంగలూరులో నీటి ఎద్దడి మరింత తీవ్ర రూపం దాల్చింది. కర్ణాటక రాజధాని అయిన బెంగలూరులో నీటి కష్టాలు తప్పడం లేదు
బెంగలూరులో నీటి ఎద్దడి మరింత తీవ్ర రూపం దాల్చింది. కర్ణాటక రాజధాని అయిన బెంగలూరులో నీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీటి కొరత మొత్తం బెంగళూరు బిజినెస్ వ్యవస్థనే సమూలంగా మార్చేసింది. అనేక చిరు హోటళ్లు ఇప్పటికే నీటి కొరతతో మూత బడ్డాయి. పెద్ద పెద్ద హోటల్స్ లో టాయ్‌లెట్ కు వెళ్లాలన్నా టోకెన్ సిస్టమ్ పెడుతుండటం విశేషం. నీటి సమస్య తీవ్రతకు ఇంతకంటే ఉదాహరణ ఏం చెప్పాలి? అని అంటున్నారు బెంగళూరు వాసులు. ఇప్పటికే బెంగళూరు నగరంలో చాలా మంది తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. ఉన్నవాళ్లలో కొందరు నీళ్లను ఆచి తూచి ఖర్చు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
చేతులు కడగాలన్నా...
ఎంతగా అంటే.. చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉపయోగించడం లేదు. పేపర్లతో తుడుచుకుంటూ మమ అని అనిపించేటంత నీటి సమస్య ఉంది. కొన్ని పెద్ద పెద్ద హోటళ్లలో సాంబారు, రసం వంటి వాటిని మెనూలో ఉంచడం లేదు. మెనూలో సాంబారు వడ, రసం ఇడ్లీలతో పాటు భోజనంలో సాంబారు లేకుండా చట్నీతోనే కానిచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. మెనూను చూసి కస్టమర్లు కూడా సాంబారు అడిగితే నీటి ఎద్దడి అంటూ నేరుగానే చెబుతున్నారు. ప్రస్తుతం బెంగలూరులో పది రోజులకు ఒకసారి నీటి సరఫరాను బెంగళూరు మహా నగరపాలిక సంస్థ చేపడుతుంది. అందుకే ప్రతి నీటి బొట్టును కూడా గొంతు తడపుకోవడానికే వినియోగిస్తున్నారు.
స్నానం చేయడం కూడా...
ప్రతి రోజూ స్నానాలు చేయడం కూడా కొందరు మానేశారు. శరీరం నుంచి దుర్గంధం రాకుండా సెంట్లు, స్ప్రేలను వాడుతున్నారని ఒక టెక్కీ చెబుతుండటం విశేషం. నీటిని నిల్వ చేసుకుంటే బెంగళూరు కార్పొరేషన్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలో బోర్లన్నీ ఎండి పోవడంతో సమస్య మరింత తీవ్రమయింది. రాజకీయ నేతల ఇళ్లకు మాత్రం రోజూ నీటి సరఫరా అవుతుండటాన్ని ప్రజలు నిలదీసిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక బెంగలూరులో ప్రస్తుతం నీటి ఎద్దడి నెలకొన్న కారణంగా భవనాల నిర్మాణాలను నిలిపేయాలని ఆపేశారు. వాటర్ బాటిల్స్ కూడా రేట్లను వ్యాపారులు పెంచేశారు. నీటి ఛార్జీలను కూడా పెంచడంతో కొనుగోలు చేసే శక్తి ఉన్న వారు మాత్రమే వాటిని ఇంటికి తెచ్చుకుంటున్నారు.
మూతబడని మెస్‌లు...
బెంగళూరులో బిల్డింగ్ కనస్ట్రక్షన్స్ పనులు నిలిచిపోవడంతో కూలీలు అనేక మంది తమ సొంతూళ్లకు ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. దీంతో చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. గత నెల రోజుల నుంచి బెంగలూరులో వ్యాపారాలు జరగక అనేక మంది తోపుడు బండ్లను మూసివేసుకున్నారు. ఖరీదైన హోటల్స్ మాత్రమే తెరిచి ఉంచాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే మెస్ ల వద్ద కూడా క్లోజ్ అనే బోర్డులు దర్శనమిస్తుండటంతో అనేక మంది తక్కువ ధరకు ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మచారులు ఈ ఇబ్బంది నుంచి బయట పడేందుకు స్వయంపాకం మొదలుపెట్టే పరిస్థితి తలెత్తింది.
Next Story