Mon Dec 23 2024 03:14:10 GMT+0000 (Coordinated Universal Time)
రైళ్ల ప్రమాదంలో కవచ్ వ్యవస్థ ఏమైంది ?
ఒకే ట్రాక్ పై వచ్చే రెండు రైళ్లను ఢీ కొట్టకుండా ఆపే ఆటోమెటిక్ వ్యవస్థే.. ఈ కవచ్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. మృతుల సంఖ్య 278కి చేరింది. మృతదేహాలన్నింటినీ ఒక ప్రాంతానికి చేర్చి.. ఆ తర్వాత అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వెయ్యిమందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 45 మంది తమిళనాడుకు చెందినవారగా గుర్తించారు. భారత చరిత్రలోనే అతిపెద్ద రైల్వే ప్రమాదంగా చెబుతున్న ఈ ప్రమాదంపై ఇప్పుడు కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైలు ప్రమాదాలను నివారించేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసుకువచ్చిన కవచ్ వ్యవస్థ ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే రైల్వే భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఏంటి ఈ కవచ్ వ్యవస్థ ?
కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. రైల్వే బడ్జెట్లో సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని అమల్లోకి తీసుకువచ్చారు. ఏటా బడ్జెట్ లో దీని కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నారు. కానీ.. ఇంత ఖర్చు చేసినా ఆ సాంకేతికత అంతపెద్ద రైలు ప్రమాదాన్ని ఎందుకు ఆపలేకపోయిందనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ప్రమాదానికి గురైన రైళ్లకు ఈ టెక్నాలజీ ఉందా ? ఉంటే ఎందుకు పనిచేయలేదు ? లేకపోతే ఎందుకు అమలు చేయలేదు ? అనేవి అందరిలో తలెత్తుతున్న ప్రశ్నలు.
ఒకే ట్రాక్ పై వచ్చే రెండు రైళ్లను ఢీ కొట్టకుండా ఆపే ఆటోమెటిక్ వ్యవస్థే.. ఈ కవచ్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. 2017 నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. లోకోమోటివ్‌లు, ట్రాక్‌లు, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్, ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి స్టేషన్లలో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాల ద్వారా ఇది పని చేస్తుంది. 4G LTE ఆధారిత సిస్టంతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సిస్టం అల్ట్రా-హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేసినప్పుడు కవచ్ హెచ్చరిస్తుంది. అలాగే బ్రేక్ లను కూడా నియంత్రించగలదు. నిర్ణీత దూరంలో అదే ట్రాక్ పై మరో రైలును గమనించగానే కవచ్ సిస్టమ్ రైలు కదలికను నిలిపివేస్తుంది. పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా సహాయపడుతుంది.
కవచ్ వ్యవస్థ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పూర్తిస్థాయిలో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్లో 65 లోకోమోటివ్‌లు, 1445 కిలోమీటర్ల మార్గంలో 134 స్టేషన్లలో అమలు చేస్తున్నారు. ట్రాక్ ల పరిధిలో చూస్తే.. 1200 కిలోమీటర్లలో కవచ్ వ్యవస్థ అమలులో ఉందట. మిషన్ రాఫ్తార్ ప్రాజెక్ట్‌లో భాగంగా న్యూఢిల్లీ-ముంబై, హౌరా-ఢిల్లీ మెయిన్ లైన్లలో 3,000 కిలోమీటర్ల మార్గంలో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని బట్టి చూస్తే.. ప్రస్తుతం ప్రమాదం జరిగిన రైల్వే జోన్ లో కవచ్ వ్యవస్థ అమలులో లేదని తెలుస్తోంది. అదే ఉండుంటే ఇంతటి ఘోర ప్రమాదం జరిగేది కాదు. అంతమంది అసువులు బాసేవారు కాదు.
Next Story