Sun Feb 16 2025 14:57:18 GMT+0000 (Coordinated Universal Time)
Prayag Raj : తొక్కిసలాటకు అదే కారణమా? అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ?
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడంపై దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది.
![prayagraj, mahakumbha mela, reason, stampede prayagraj, mahakumbha mela, reason, stampede](https://www.telugupost.com/h-upload/2025/01/29/1685404-prayag-raj.webp)
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడంపై దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది. అమృత స్నానాల కోసం ప్రయాగ్ రాజ్ కు వచ్చిన భక్తులు తొక్కిసలాట జరగడంతో ఇరవై మంది వరకూ మరణించారని చెబుతున్నారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. మౌని అమావాస్య రోజు గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భావించి ఒక్కరోజులోనే పది కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు. ముందు నుంచి అనుకుంటున్నదే. అంచనా వేస్తున్నదే. అందరూ సంగం ఘాట్ వద్దకు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తమ కుటుంబ సభ్యలు కనపడని వారు ఆందోళనచెందుతున్నారు.
సంగం ఘాట్ లోనే...
సంగం ఘాట్ లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని కొందరు చెప్పడం వల్లనే అందరూ అదే ఘాట్ కు ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో బ్యారికేడ్లు తోసుకుని స్నానం చేసేందుకు ముందుకు వెళ్లడంతో నిన్న రాత్రి ఘాట్ వద్ద నిద్రిస్తున్న భక్తులపై పడి పదులసంఖ్యలో మరణించారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. నిన్నటి వరకూ మహా కుంభమేళాకు 19 కోట్ల మంది భక్తులు తరలి వచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ తొక్కిసలాటలో యాభై మందికి గాయాలు కావడంతో వారిని వెంటనే సమీపంలోని వైద్య శిబిరాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంబులెన్స్ లు కూడా అక్కడే ఉండటంతో వెంటనే వైద్య శిబిరాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిలిచిన వాహనాలు...
ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు ఈరోజు తరలి రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. అమృత్ స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు తరలి రావడంవల్లనే ఈ ఘటన జరిగింది. భక్తులు ఏ ఘాట్ లోనైనా స్నానం చేయవచ్చని ప్రభుత్వం చెబుతుంది. కేవలం సంగం ఘాట్ కు మాత్రమే రావాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు రైళ్లను కూడా రద్దు చేశారు. తొక్కిసలాట జరగడంతో ప్రయాగరాజ్ కు వెళ్లే మార్గంలో 47 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పదహారు గంటలుగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాల్లో ఉన్న ప్రయాణికులు నీరు, భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. వైద్య శిబిరాల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిచారు. ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు.
Next Story