Thu Nov 21 2024 19:21:21 GMT+0000 (Coordinated Universal Time)
వణుకుతున్న ఉత్తరభారతం.. రూ.3000 వేల కోట్ల ఆస్తినష్టం
రెండురోజులుగా ఢిల్లీలో వర్షాలు పడకపోయినా.. హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం..
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను చిగురుటాకులా వణికిస్తున్నాయి. ఇప్పటికే యమునానది ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్ర సహాయం కోరారు. ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. కేంద్ర జలకమిషన్ సమాచారం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.55 మీటర్లకు పెరిగింది. హర్యానా నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నదికి వరద నీరు పోటెత్తింది. 45 ఏళ్ల నాటి గరిష్టానికి యమునా నది నీటిమట్టం చేరిందంటే.. అక్కడ వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
రెండురోజులుగా ఢిల్లీలో వర్షాలు పడకపోయినా.. హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని తాకడంతో కేంద్ర జోక్యం కోరారు కేజ్రీవాల్. యమునా నది ప్రమాదకర స్థాయి దాటి వరదలు రాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు వరదలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. బియాస్ నది ఉగ్రరూపానికి ఎక్కడికక్కడ వంతెనలు కొట్టుకుపోగా.. రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. ఒక్క హిమాచల్ ప్రదేశ్ లోనే రూ.3000 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారుల అంచనా. అలాగే నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు 80 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో పంజాబ్ లో 15 మంది, ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి 9 మంది చనిపోగా 13 మంది గాయపడ్డారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లినవారిలో 300 మంది యాత్రికులు పర్వతాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. తెలంగాణ ఉస్మానియాకు చెందిన వైద్యులు, కుల్లు వద్ద కనిపించకుండా పోయిన నలుగురు విద్యార్థుల ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, హరియాణా తదితర రాష్ట్రాల్లో కొండచరియలు విరిగి పడటంతో 1300 రోడ్లు బ్లాక్ చేశారు. చండీగఢ్ - మనాలీ, సిమ్లా - కాల్కా జాతీయ రహదారులను సైతం మూసివేసినట్లు తెలిపారు. 20 వేల మంది వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో జులై 15 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
Next Story