Thu Dec 19 2024 16:49:50 GMT+0000 (Coordinated Universal Time)
Parliament Attack : రెక్కీ జరిపారు.. తర్వాతనే దాడికి.. తప్పించుకున్న వారి కోసం వేట
పార్లమెంటులో నిన్న జరిగిన దాడిలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
పార్లమెంటులో నిన్న జరిగిన దాడిలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు ముందుగా రెక్కీ జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిన్న జరిగిన పార్లమెంటు దాడిలో మొత్తం ఆరుగురు పాల్గొనగా, నలుగురు నిందితులు పోలీసులకు చిక్కారు. మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. వారి కోసం వేట మొదలయింది. ఈ ఘటనలో మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్ , అమోల్ శిందే, విశాల్, లలిత్ లు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇద్దరి కోసం వేట..
వీరిలో మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందే పోలీసులకు చిక్కారు. విశాల్, లలిత్ మాత్రం తప్పించుకున్నారు. వీరికోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పార్లమెంటు భవనంలోకి చొరబడి దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అతి పెద్ద భద్రతా వైఫల్యంగా పేర్కొంటూ ఎనిమిది మంది సిబ్బందిపై వేటు వేసింది. అయితే వాళ్లు ఎలా లోపలికి చొరబడ్డారన్న దానిపై ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వీరు ఎలా పార్లమెంటులోకి ప్రవేశించింది.. ఎలా దాడికి పాల్పడింది పోలీసుల విచారణలో నిందితులు కక్కేశారు.
బడ్జెట్ సమావేశాల్లోనే....
ఈ నిందితులందరికీ అసలు బాస్ మనోరంజన్. మైసూరుకు చెందిన మనోరంజన్ పార్లమెంటు సభ్యుడి నుంచి పాస్ పొందారు. అతనితో పాటు సాగర్ శర్మకు కూడా పాస్ ఇప్పించాడు. బడ్జెట్ సమావేశాల సందర్భంగానే వీరు పార్లమెంటులో రెక్కీ జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎలా పార్లమెంటులోకి ప్రవేశించాలి? ఎలా అటాక్ చేయాలన్న దానిపై వీరు ముందుగా రెక్కీ చేసిన తర్వాతనే ప్లాన్ అమలులో పెట్టినట్లు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. వీరిని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపర్చి కస్టడీకి కోరనున్నారు. మరిన్ని విషయాలు బయటపడాల్సి ఉంది.
Next Story