పన్నీర్ కుర్చీకి ఎర్త్ పెట్టేసిన శశికళ?
చిన్నమ్మ క్షణం ఊరుకోవడం లేదు. శశికళ సీఎం కుర్చీపైకి ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని తెగ ఆరాట పడిపోతోంది. ఈ వారంలోనే తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను తప్పించి తాను అధికారాన్ని చేపట్టాలన్న శశికళ కోరిక త్వరలోనే నెరవేరబోతున్నట్లు తమిళనాడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నెల 8వతేదీ లేదా 9వ తేదీన శశికళ సీఎం బాధ్యతలను చేపట్టబోతున్నట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. అందుకోసమే చిన్నమ్మ పావులు కదుపుతోంది. నిన్న పార్టీ సీనియర్ నేతలకు కొన్ని కీలక పదవులను కట్టబెట్టారు శశికళ. మాజీ మంత్రి కె. సెంగోట్టాయన్ , మాజీ మేయర్ సైదాయ్ ఎస్ దురైసామిలను పార్టీ కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా పదవుల నుంచి పీకేశారు. అన్నాడీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవి నుంచి ఎమ్మెల్యే అలగ్జాండర్ ను తప్పించేశారు. ఇలా తన వ్యతిరేక వర్గం వారిపై వేటు వేస్తూ...అనుకూల నేతలకు పదవులను కట్టబెడుతూ సీఎం పీఠం కోసం చిన్నమ్మ వేగంగానే పావులు కదుపుతున్నారు. అనేకమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు పార్టీలో పదవులను కట్టబెట్టారు.
శాసనసభాపక్ష అత్యవసర సమావేశం....
ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల శాసనసభ పక్ష సమావేశాన్ని అత్యవసరంగా సమావేశపరుస్తున్నారు. ఈ సమావేశంలోనే శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదు. అయితే చిన్నమ్మ కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. శశికళ పన్నీర్ సెల్వంపై తీవ్రంగా వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఉప ఎన్నికల్లో నిలబడాలని ఆమె భావిస్తున్నారు. ఈ వ్యూహమంతా చిన్నమ్మ భర్త నటరాజన్ ముందుండి నడిపిస్తున్నారు. మరోవైపు అధికారులపై కూడా చిన్నమ్మ వేటు వేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలను చూస్తున్న ముగ్గురు అధికారులను ఇంటికి సాగనంపారు. ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ ను రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది. ఆమె నేడో, రేపో రాజీనామా చేయనున్నారు. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 73 రోజులూ షీలా బాలకృష్ణన్ దగ్గరుండి ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించారు. మరి చిన్నమ్మ ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలియదు కాని షీలాను పదవికి రాజీనామా చేయాలని పన్నీరు సెల్వం కార్యాలయం ద్వారా కోరారు. ఆదివారం అన్నాడీఎంకే శాసనసభా పక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చివరి నిమిషంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.