కేసీఆర్ మెడలో కొత్త గుదిబండ
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ ఆచరించలేదు.. అని పదేపదే కేసీఆర్ సర్కారు మీద బురద చల్లడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే హామీలన్నీ కాకపోవచ్చు గానీ... ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానన్న వాగ్దానం మాత్రం సర్కారు మెడలో గుదిబండగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ విషయమై ఏర్పాటుచేసిన సుధీర్ కమిషన్ నివేదిక కూడా 12 శాతానికి అనుకూలంగా ఉన్నదని తెలిసిన తర్వాత.. ఇక మాట నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
తెలంగాణలోని ముస్లింల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసిన రిటైర్డు ఐఏఎస్ అధికారి సుధీర్ కమిటీ తన నివేదిక ను ఆగస్టులోనే ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దీనిని డిసెంబరు 10న బయటపెట్టారు. తెరాస సర్కారు గత ఏడాది ఏర్పాటుచేసిన ఈ నలుగురు సభ్యుల కమిటీ.. ముస్లింలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 12 శాతం- కుదరకపోతే కనీసం 9 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది.
తెలంగాణలోని 3.52 కోట్ల జనాభాలో 12.68 శాతం ఉన్న ముస్లింలు ఇప్పటికే బీసీలుగా ఉన్నప్పటికీ వారి కోటాను 12 శాతానికి పెంచవచ్చునని పేర్కొన్నది. ఇప్పుడున్న నాలుగు శాతం రిజర్వేషన్ ను కొనసాగిస్తూ 12 శాతం కల్పించడానికి న్యాయ సలహా తీసుకుని, అవసరమైన చట్టం చేయాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది.
2014 ఎన్నికల్లో తెరాస చేసిన 12 శాతం వాగ్దానం ఇంకా అసంపూర్ణంగానే ఉంది. ఈ రెండున్నరేళ్లలో సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ముస్లిం రిజర్వేషన్ కు తాము కట్టుబడి ఉన్నాం అనే సంగతిని చెబుతూ వచ్చారు. ఈ మాట నిలబెట్టుకోవడంలొ కేసీఆర్ సర్కారు ముందుకెళితే గనుక చాలా చట్టపరమైన చిక్కులను కూడా అధిగమించాల్సి ఉంటుంది. ఈ దిశగా తీసుకునే ఏ నిర్ణయమైనా సరే.. మొత్తం రిజర్వేషన్ లు ఉండవలసిన పరిమితి 50 శాతానికి దాటిపోతుంది. అయితే కేసీఆర్ పలుమార్లు 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న తమిళనాడు మోడల్ అనుసరిస్తామని చెబుతూ వచ్చారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి రాజ్యాంగ సవరణ కోసం కేంద్రానికి పంపుతాం అని కూడా కేసీఆర్ అంటూ వచ్చారు. అసలే కేసీఆర్ ఈ అంశాన్ని సీరియస్ గా పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు చాలా కాలంగా దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్రంలోని భాజపా సర్కారు ముస్లిం రిజర్వేషన్ లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోదు అనే ధీమాతోనే కేసీఆర్ ఈ కొత్త డ్రామా ఆడుతున్నారని కూడా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
గతంలో వైఎస్సార్ హయాంలో 5 శాతం రిజర్వేషన్ కల్పించినందుకే న్యాయపరమైన చిక్కులు వచ్చాయి . సుదీర్ఘకాలం కోర్టులో పోరాడాక దానిని నాలుగు శాతానికి తగ్గించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జాగ్రత్త తీసుకున్నారు. అప్పట్లో మైనారిటీ మంత్రి అయిన షబ్బీర్ ఆలీ బీసీ కమిషన్ నుంచి సిఫారసు వస్తే తప్ప.. ఈ విషయంలో ఏమీ చేయలేం అని అన్నారు.
ఈ అన్ని కోణాలను పరిశీలించినప్పుడు.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అనే వాగ్దానం నిలబెట్టుకోవడం కేసీఆర్ సర్కారు మెడలో కొత్త గుదిబండగా మారుతున్నదనే అనిపిస్తోంది.