అఖిలకు ఆమే పోటీ వస్తారా?
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే....మంత్రి అఖిలప్రియకు చెల్లెమ్మ చేటు తేనుందా? అఖిలప్రియ కంటే ఆమె చెల్లెలు నాగమౌనిక బెటర్ అని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. మంత్రి అఖిలప్రియ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో అఖిలప్రియ తన వ్యవహార శైలితో సొంత పార్టీకి ఎసరు తెచ్చేలా ఉన్నారు. అంతేకాదు ఇదే పోకడలను కంటిన్యూ చేస్తే అఖిప్రియ వచ్చే ఎన్నికల్లో గెలవడం కూడా కష్టమేనన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల అంచనా. అఖిలప్రియ చేజేతులా తన రాజకీయ జీవితాన్ని ఎదుగుదల లేకుండా చేసుకుంటున్నారన్న టాక్ ఆళ్లగడ్డలోనూ విన్పిస్తోంది.
చిన్న వయస్సులో....
అఖిలప్రియ...చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ఆమె ప్రమేయం లేకుండానే అడుగుపెట్టాల్సి వచ్చింది. తల్లి శోభానాగిరెడ్డి మరణంతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అఖిలప్రియను ప్రజలు ఎన్నుకోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు ఆమె ప్రత్యర్థులు. అమ్మ మరణంతో ఎమ్మెల్యే అయిన అఖిలప్రియకు తండ్రి కాలధర్మం చేయడంతో మంత్రి పదవి లభించింది. చిన్న వయస్సులో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అఖిల డోన్ట్ కేర్ తరహాలో వెళుతుండటం ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయంటున్నారు.
సర్వే ఫలితాలను బట్టి.....
అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండురోజుల క్రితం జరిగిన పంచాయతీలో కూడా అఖిలప్రియకు వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ సీటుపై ఎలాంటి హామీ ఇవ్వలేదంటున్నారు. ఎన్నికలకు ముందు తాము చేయించే సర్వేల్లో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తే వారికే టిక్కెట్ అని తేల్చి చెప్పారు పార్టీ అధినేత. ఇందుకు మరోకారణం కూడా ఉందంటున్నారు. అఖిలప్రియ, నాగమౌనిక అక్కా చెల్లెళ్లు. నాగమౌనిక జర్నలిజంలో డిగ్రీ చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. అప్పుడే నాగమౌనిక టీడీపీ అధినేత దృష్టిలో పడ్డారు. పోలింగ్ సమయంలో బూత్ లలోకి దూసుకెళ్లడం, ఆమె వాగ్డాటి బాబును ఆకర్షించిందని చెబుతున్నారు.
ఆకట్టుకున్న నాగమౌనిక.....
దీంతో పాటు ఇటీవల అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య తలెత్తిన వివాదంలో నాగమౌనిక మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఏవీ సుబ్బారెడ్డి తమ వాడంటూనే అక్క వైపు వేలెత్తి చూపితే ఊరుకోనంటూ హెచ్చరికలు జారీ చేశారు నాగమౌనిక. ఆళ్లగడ్డలో సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏం జరిగిందో వివరించారు. అంతేకాకుండా తాము తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నామని, తమకు పెద్దదిక్కుగా చంద్రబాబు ఉంటారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు కూడా. నాగమౌనిక మాటలు నేతలను కూడా ఆకట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు నాగమౌనిక పోటీగా మారే అవకాశముందంటున్నారు. మరి చంద్రబాబు సర్వేలో ఎవరికి అనుకూలంగా ఫలితమొస్తే వారికే టిక్కెట్ అని చెప్పడంతో ఇద్దరిపేర్లతో సర్వే చేయించే అవకాశమూ లేకపోలేదంటున్నారు. మొత్తం మీద ఆళ్లగడ్డ వ్యవహారాన్ని అఖిలప్రియ రచ్చ రచ్చ చేసుకున్నారన్న టాక్ విన్పిస్తోంది.