వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు షాక్.. కొత్త అభ్యర్థి ఎవరో తెలుసా.. !
గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతం, రాజధానికి అతి సమీపంలో ఉన్న మంగళగిరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు షాక్ తప్పడం లేదా ? వచ్చే ఎన్నికల్లో ఆర్కే మంగళగిరి నుంచి పోటీ చెయ్యడం లేదా? ఆయనకు బదులుగా మరో అభ్యర్థిని జగన్ అక్కడ రంగంలోకి దింపనున్నారా ? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్కే టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి స్వల్ప తేడాతో ఓ అభ్యర్థి గెలిచిన సీటు మంగళగిరే కావడం విశేషం. అయితే మంగళగిరిలో వైసీపీ నుంచి ఆర్కే 12 ఓట్లతో గెలిచినా ఎంపీకి వచ్చేసరికి టీడీపీ నుంచి పోటీ చేసిన గల్లా జయ్‌దేవ్‌కు 5000 పైచిలుకు ఓట్ల మెజారిటీ రావడం గమనార్హం.
క్రాస్ ఓటింగ్ తోనే......
ఇక్కడ క్రాస్ ఓటింగ్‌తోనే ఆర్కే గెలిచారని స్పష్టం అవుతుంది. రాజధాని ప్రాంతం కావడంతో మంగళగిరి సీటు కోసం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ రెండూ హోరా హోరిగా పోరాడుతున్నాయి. ఈ సీటును రెండు పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రానికి చెందిన పలు కీలక కార్యాలయాలు ఈ నియోజకవర్గంలో ఉండడంతో ఈ సీటు ఇరు పార్టీలకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్టు తెలసింది. ఇందుకోసం ఓ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో పాటు అదే కుటుంబానికి చెందిన ఓ రాజకీయ వారసుడు పేరు సైతం ముందుగా వైసీపీ నుంచి పరిశీలించారు. ఈ ఫ్యామిలీ కన్నా క్లీన్ ఇమేజ్ ఉన్న మరో అభ్యర్థిని ఎంపిక చెయ్యాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఆ పేరు పరిశీలనలో.....
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఓ కీలక శాఖకు విభాగ అధిపతిగా పని చేసిన వ్యక్తి కుమార్తె పేరును ఇక్కడ నుంచి వైసీపీ సీరియస్‌గా పరిశీలిస్తోంది. సామాజికవర్గాల పరంగా ఆమె చిలకలూరిపేటలో విడదల రజినీ, తాడికొండలో కొత్తగా తెరపైకి వస్తున్న డాక్టర్ శ్రీదేవి తరహాలో రెండు కులాల ఈక్వేషన్లతో ఆమెకు సంబంధం ఉండడంతో ఆమె అయితేనే ఇక్కడ బలమైన అభ్యర్థి అవుతారని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.
వీటిని బీసీలకు.....
ఇదే టైమ్‌లో గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, రేపల్లె, మంగళగిరి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలను బీసీలకు ఇవ్వడంతో టీడీపీ ఓటు బ్యాంక్ అయిన బీసీ ఓటు బ్యాంకును భారీగా కొల్లగొట్టవచ్చన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. మంగళగిరిలో కూడా బీసీ ఓటర్లు బలంగా ఉన్న నేపథ్యంలో జగన్ బీసీ అస్త్రంతోనే ఇక్కడ టీడీపీకి చెక్‌పెట్టాలని చూస్తునట్టు తెలుస్తోంది. ఇక ఇక్కడ బీసీ అభ్యర్థిని దింపితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేకు ఎమ్మెల్సీ లేదా ఆయన్ను సత్తెనపల్లి బరిలో దింపవచ్చని తెలుస్తోంది. మరి జగన్ నయా స్ట్రాటజీలు వైసీపీ అభ్యర్థులను జిల్లాలో ఎంత వరకు గెలిపిస్తాయో, ఎన్నికల్లో ఏం జరుగుతుందో ? చూడాల్సి ఉంది.
- Tags
- alla ramakrishna reddy
- andhra pradesh
- ap politics
- guntur district
- janasena party
- mangalagiri constiuency
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఆళ్ల రామకృష్ణారెడ్డి
- ఏపీ పాలిటిక్స్
- గుంటూరు జిల్లా
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- మంగళగిరి నియోజకవర్గం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ