శాసించిన చోటే...ఊగిసలాట...!
ఒక్కప్పుడు జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన ఆ మాజీ మంత్రి, జగన్ ఆప్యాయంగా మామా అని పిలుచుకునే ఆ వ్యక్తి పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం గందరగోళంలో పడిపోయిందా ? జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ రాజకీయాల్లో ఒంటి చేత్తో చక్రం తిప్పి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఆ నేత ఇప్పుడు తీవ్ర సంకటస్థితిలో ఉన్నారు. చివరకు ఆయనకు తాను పోటీ చేసే సొంత నియోజకవర్గం విషయంలోనే క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందా ? అంటే ప్రకాశం జిల్లా జనాలు అవుననే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో మాజీ మంత్రిగా పదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన జగన్ మామ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఇప్పుడు సొంత జిల్లాలోనే కాదు... సొంత నియోజకవర్గంలోనూ... సొంత పార్టీలోనే అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారు.
అప్పుడు బాలినేనిదే....
జగన్‌కు బాబాయ్ అయిన ఒంగోలు ఎంపీ వైవి. సుబ్బారెడ్డితో జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరాటంలో బాలినేని నలిగిపోతున్నారు. ఒక్కప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైఎస్ బతికి ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో బాలినేని ఏది చెపితే అదే చెల్లుబాటు అయ్యేది. జగన్ వైసీపీ స్థాపించినప్పుడు తన ఎమ్మెల్యే పదవిని వదులుకుని సైతం 2012 ఉప ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు. ఆయన మాట గత ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో బాగా చెల్లుబాటు అయ్యింది. బాలినేని ప్రకాశం జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో సైతం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే రేంజ్‌కు వెళ్లారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఓడిపోవడం, ఎంపీగా వైవి. సుబ్బారెడ్డి స్వల్ప మెజారిటీతో గట్టు ఎక్కడంతో జిల్లా రాజకీయాల్లో సుబ్బారెడ్డి పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
పట్టుసాధించిన వైవీ......
తాను ఎంపీగా ఉన్నానని... తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో తన మాటే చెల్లుబాటు కావాలని... అయినా ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వారి మాటకు విలువ ఉండదని.... తాను గెలిచాను కాబట్టి తన మాటే నెగ్గాలని సుబ్బారెడ్డి బాలినేనితో పోరుకు దిగారు. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో క్రమక్రమంగా ఒక్కో నియోజకవర్గంపై పట్టు సాధిస్తూ వచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో తనకు నచ్చినట్టు అభ్యర్థులను మార్పులు చేర్పులు కూడా చేసేశారు. సుబ్బారెడ్డి అలా దూసుకుపోతుంటే చివరకు బాలినేని తన సొంత నియోజకవర్గమైన ఒంగోలులో పోటీ చెయ్యాలా ? లేదా నియోజకవర్గం మారాలా ? అన్న డైలమాలో పడిపోయారు. ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు అనేక సానుకులతలు కలిసి వచ్చాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు చంద్రబాబు దగ్గర మంచి పేరు ఉండడంతో ఆయన కోట్లాది రూపాయిలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు.
ఒంగోలు నుంచి ఫిఫ్ట్ అవ్వాలని.....
దీనికి తోడు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఆయనకు ఉన్న బంధుత్వం నేపథ్యంలో స్వచ్ఛ ఒంగోలులో భాగంగా కేంద్రం నుంచి నేరుగా కోట్లాది రూపాయిలు తీసుకువచ్చి ఒంగోలు రూపురేఖలే మార్చేసారు. తాజాగా ఒంగోలు నగరంలో జరుగుతున్న 16 వేల ఇళ్ల నిర్మాణం, రామతీర్థం నుంచి ఒంగోలు నగరానికి నీటి తరలింపు, ఒంగోలులో రహదారుల విస్తరణ, భూగర్భ డ్రైనేజ్ , మినీ స్టేడియం ఇలా చాలా పనులు నాలుగేళ్లల్లో జనార్ధన్ చెయ్యడంతో వచ్చే ఎన్నికల్లో బాలినేని గెలుపు అంత సులువు కాదన్న చర్చలు నడుస్తున్నాయి. దీనికి తోడు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న సుబ్బారెడ్డి వర్గం సైతం బాలినేనికి ఏమేరకు సహకరిస్తుంది అన్నది సందేహంగానే ఉంది. ఈ క్రమంలోనే బాలినేని కొద్ది రోజులుగా పశ్చిమ ప్రకాశంలో ఉన్న మార్కాపురం నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతారని... వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది.
దర్శిలో పోటీ చేసేందుకు.....
ఇక తాజాగా ఇప్పుడు బాలినేని పేరు మంత్రి శిద్ధా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శిలో నుంచి కూడా వినిపిస్తోంది. దర్శిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇన్చార్జ్ భాధ్యతల నుంచి తప్పుకోవడంతో జగన్ అక్కడ కొత్తగా మమిత ఫౌండేషన్ అధినేత బాదం మాధవరెడ్డికి పగ్గాలు అప్పగించారు. మాధవరెడ్డి సైతం నియోజకవర్గంలో పార్టీ పరంగా దూసుకువెళ్లడంలో విఫలం అయ్యినట్లు పార్టీ అధిష్టానం భావిస్తోంది. తాజాగా విశాఖలో జరిగిన పార్టీ జిల్లా సమావేశానికి సైతం ఆయన డుమ్మా కొట్టారు. దీంతో జగన్ అక్కడ మరో నాయకుడిని ఎంపిక చేసే భాధ్యతలు సైతం బాలినేని చేతుల్లో పెట్టారు. ఈ క్రమంలోనే బాలినేని సైతం అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుందా ?అన్న ఆలోచన కూడా అధిష్టానం చేస్తోంది. మంత్రి శిద్ధా రాఘవరావును ఢీ కొట్టాలంటే బాలినేని వల్లే సాధ్యం అవుతుందన్నా ఆలోచన వైసీపీ అధినేత మదిలో ఉన్నా బాలినేని దర్శిలో పోటీ చేసేందుకు ఎంత వరకూ సముఖత వ్యక్తం చేస్తారు అన్నది మాత్రం సందేహమే.
ఊగిసలాటలో.....
బాలినేని దర్శిలో పోటీ చేసేందుకు ఇష్టపడకపోతే 2009 ఎన్నికల్లో దర్శిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత మద్దిశెట్టి వెణుగోపాల్ను ఇక్కడ తెర మీదకు తీసుకురావాలని చూస్తున్నారు. ఏదేమైనా సుబ్బారెడ్డితో విభేదాలు, సిట్టింగ్ ఎమ్మెల్యే జనార్ధన్ దూకుడు నేపథ్యంలో ఒంగోలులో పోటీ విషయంలో ఊగిసలాటలో ఉన్న బాలినేనికి ఇప్పుడు మిగిలిన చోట్ల ఎక్కడ పోటీ చెయ్యాలన్నా ? అంత త్వరగా పట్టు వస్తుందా ? అన్నది కూడా సందేహమే. ఒక్కప్పుడు జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన బాలినేని ఇప్పుడు సొంత నియోజకవర్గంలో గెలుపుపైనే సందేహంతో ఉన్నట్టే కనిపిస్తోంది.
- Tags
- andhra pradesh
- ap politics
- balineni srinivasulureddy
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- prakasam district
- telugudesam party
- y.s. jaganmohan reddy
- y.v.subbareddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రకాశం జిల్లా
- బాలినేని శ్రీనివాసులురెడ్డి
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వై.వి.సుబ్బారెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ