బొంగులో చికెన్ ఇక లేనట్లే...?
బ్యాంబూ చికెన్ ... బొంగులో చికెన్... వెదురు బొంగులో చికెన్ ఇలా పేరేది అయినా ఇప్పుడు ఈ చికెన్ కనుమరుగు కానుంది. దశాబ్దం క్రితం తూర్పు ఏజెన్సీ ద్వారా ప్రపంచానికి పరిచయం అయిన బొంగులో చికెన్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం ఈ వెదురు బొంగు చికెన్ రుచి చూసేందుకు నాన్ వెజ్ ప్రియులు ఏజెన్సీ బాట పట్టేవారంటే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ చెప్పకనే చెప్పొచ్చు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ లో మొదటి సారి దీనికి ఆదరణ మొదలైంది. ఇది క్రమంగా పుంజుకుని తెలంగాణ లోని ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం అటవీ ప్రాంతం వరకు విస్తరించింది. కొద్దిమంది నుంచి ప్రారంభమై వేలమంది గిరిజనానికి ఉపాధి కల్పిస్తుంది బొంగులో చికెన్. దీనిపై పేటెంట్ కూడా కల్పించాలని ఆదివాసీ గిరిజనం ఐటిడి కి వినతిని కూడా పెట్టుకున్నారు.
ఎలా తయారు చేస్తారు ...
బొంగులో చికెన్ లో వెదురు బొంగులు వినియోగిస్తారు. ఆ బొంగుల్లో మసాలా దట్టించిన చికెన్ ముక్కలు పెట్టి అటు ఇటు మూత పెట్టి ఉడికిస్తారు. అలా ఉడికిన చికెన్ ఆకుల్లో పెట్టి వడ్డిస్తారు. వెదురు బొంగులను మంటల్లో వేసి అది మాడే వరకు ఉంచడంతో ఆ కర్రలో వుండే నీరుతో చికెన్ ఉడుకుతుంది. అది ఒకరకమైన కొత్త టేస్ట్ ను చికెన్ ముక్కలకు అందిస్తుంది. ఈ రుచి కి అలవాటు పడే నాన్ వెజ్ ప్రియులు మళ్ళీ మళ్ళీ తినేందుకు అడవులకు తరలివస్తున్నారు.
అటవీశాఖ నిషేధాజ్ఞలు ...
పెద్ద ఎత్తున వెదురు కూపులు అంతరించిపోతున్నాయి. దీనికి కారణం ఈ బొంగులో చికెన్ తయారీ నే అని అటవీశాఖ గుర్తించింది. వెదురు పెంపకం డిమాండ్ కు తగ్గట్లు పెరగడం లేదు. దాంతో అటవీ చట్టాల ప్రకారం వెదురు బొంగులను నరికివేతను అడ్డుకుంది అటవీశాఖ. బొంగులో చికెన్ అమ్మేవారిపై భారీ జరిమానాలు విధించడం మొదలు పెట్టింది. ఫలితంగా ఇప్పుడు ఏజెన్సీ వ్యాప్తంగా ఈ చికెన్ అందించే దుకాణాలు మూతపడుతూ వచ్చాయి. దాంతో బొంగులో చికెన్ ను ఆస్వాదించే పర్యాటకుల్లో నిరాశ ఎదురైంది. బొంగులో చికెన్ పై నిషేధం ఉందన్న సంగతి తెలియక వచ్చే వారు కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వేలాదిమంది గిరిజనులకు ఇప్పుడు ప్రధాన జీవనాధారంగా మారిన ఈ చికెన్ పై ఆంక్షలు వారి ఉపాధికి గండి పెట్టాయి. దీనిపై తమ గోడు పట్టించుకోవాలని గిరిజనం ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. మరి గిరిపుత్రుల సమస్య పరిష్కారం అవుతుందో లేదో చూడాలి.