ఈ ఇద్దరు ఎమ్మెల్యేల బాధ ఎవ్వరికి రాకూడదా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయడంతో ఆ రెండు నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రం విచిత్రంగా తయారైంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే... ఈ రెండు నియోజవర్గాల ఎమ్మెల్యేల సొంత గ్రామాలు కూడా ఆంధ్రలో విలీనం కావడం గమనార్హం.
వచ్చే సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటు పార్టీల్లో, ఇటు ఆయా మండలాల ప్రజల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్దామని చూసినా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు, ఎమ్మెల్యేలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఇవి ఆంధ్రాలో ఉన్నాయి. కాని వీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మాత్రం తెలంగాణకు ప్రాథినిత్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడ అభివృద్ధి విషయంలో కూడా అంతా కన్ఫ్యూజన్గా ఉంది.
ఏపీలో ఉన్న మండలాల అభివృద్ధి, ప్రజల సమస్యలను ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించే నాథుడే లేకుండా పోయారు. అసలు వీరు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. 2014 ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,11,437 ఉన్నాయి. ఇప్పుడు పలు గ్రామాలు ఆంధ్రలో విలీనం కావడంతో ఈ ఓట్లలో భారీగా కోతపడింది. ప్రస్తుతం 1,24,000 ఓట్లు మాత్రమే ఉంటున్నాయి. దీంతో దాదాపుగా 87వేల ఓట్లు కోతకు గురవుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గంలో తెలంగాణలో వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం, భద్రాచలం పట్టణం మాత్రమే మిగిలాయి. ఇక్కడ సీపీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సొంతూరు కూడా ఆంధ్రలోకి వెళ్లింది.
ఇక అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2,64,410 ఓట్లకు గాను ఇప్పుడు 1,27,571 ఓట్లు మాత్రమే మిగులుతున్నాయి. దాదాపుగా లక్ష ఓట్లకు పైగా కోతపడ్డాయి. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సొంతూరు తాట్కూరుగొమ్ము కూడా ఆంధ్రలో కలిసింది. ప్రస్తుతం ఇక్కడ చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట మండలాలే మిగిలాయి. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓటు బ్యాంకును కోల్పోయింది వామపక్షాలేనని పలువురు నాయకులు అంటున్నారు. ఏదేమైనా ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో ?తమకు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గాల ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో భద్రాచలంలో ఎలైగానా గెలవాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర పార్టీల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలోకి వచ్చేలా ప్రణాళిక రచించి, అమలు చేస్తున్నారు. తుమ్మల అండతోనే టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఎం నుంచి గెలిచిన జెడ్పీటీసీలు, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు చెందిన ఎంపీపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రలో కలిసిన ఆ మండలాలపై ఈసీ ఎలాంటి నిర్ణయం కీలకంగా మారనుంది.