బాబు గారి దయతో మళ్లీ పవర్ గులాబీకేనా..?
తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా మహాకూటమి ఏర్పడింది. టీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమిలో తెలుగుదేశం పార్టీతో పాటు సీపీఐ, తెలంగాణ జన సమితి కూడా చేరింది. రెండు నెలల పాటు తీవ్రంగా చర్చలు జరిపి సీట్ల పంపకాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో, టీడీపీ 13 స్థానాల్లో, టీజేఎస్ 11 స్థానాల్లో, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే, కొంత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో 11 స్థానాల్లో కూటమిలోని పార్టీల మధ్యే స్నేహపూర్వక పోటీ నెలకొంది. ఇక మహాకూటమి ఏర్పాటుపై రెండు నెలల క్రితం ప్రజల్లో కొంత సానుకూలత ఏర్పడింది. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఒంటరిగా ఢీకొట్టలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ కూటమి కట్టింది. అయితే, రానురాను కూటమి కట్టడమే కాంగ్రెస్ కి ముప్పయ్యేలా పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీతో పొత్తు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందంటున్నారు.
గత ఎన్నికల్లో ప్రభావం చూపినా...
మహాకూటమిలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరాం నేతృత్వంలోనే టీజేఎస్ చేరికను ఎవరూ తప్పుపట్టలేరు. ఇక తెలంగాణకు ముందు నుంచీ అనుకూలంగా ఉండి ఉద్యమంలో పాల్గొన్న సీపీఐ పట్ల కూడా వ్యతిరేకత లేదు. అయితే, తెలుగుదేశం పార్టీతోనే అసలు సమస్య వచ్చింది. టీడీపీ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసింది. ఆంధ్రా పార్టీగానే ముద్రపడింది. అయితే, గత ఎన్నికల్లో సెటిలర్లు ఏకపక్షంగా టీడీపీ వైపు నిలవడం, నరేంద్ర మోదీ హవాలో బీజేపీతో పొత్తు, బలమైన నాయకులు ఉన్నందున టీడీపీ 14 శాతం ఓట్లు సాధించి 15 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అదే సమయంలో సెటిలర్ల ప్రభావం లేని అనేక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఇక ఈ నాలుగేళ్లుగా రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్ఎస్ చేరారు. వ్యక్తిగత ఛరిష్మాతో గెలిచిన నేతలు కూడా కారు పార్టీలో చేరారు. క్యాడర్ కూడా చెల్లాచెదురైంది. ఇక రేవంత్ టీం కాంగ్రెస్ లో చేరికతో టీడీపీకి మరింత దెబ్బ పడింది. ఆయనతో సుమారు 20 మంది నియోజకవర్గ స్థాయిలో మంచి పట్టున్న నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో తెలంగాణలో ఇక టీడీపీ నామమాత్రమే అనే అంచనాలు ఏర్పడ్డాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికలతో తేలిపోయింది...
ఇక సెటిలర్లు కూడా జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ వైపు నిలిచారు. టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా, చంద్రబాబు, లోకేష్ ప్రచారం నిర్వహించినా, ఆంధ్రా నుంచి నేతలు దిగినా ఆ పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు చూశాకే ఎక్కువమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇక టీడీపీలో భవిష్యత్ ఉండదనే టీఆర్ఎస్ లో చేరారు. ఇంతలా దెబ్బతిన్న పార్టీని కాంగ్రెస్ మహాకూటమిలో చేర్చుకుంది. అయితే, కేవలం టీడీపీ కూటమితో చేరాక పెద్దగా వ్యతిరేకత ఎవరూ వ్యక్తం చేయలేదు. తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడం, మహాకూటమి వ్యవహారాన్ని అమరావతి నుంచి పర్యవేక్షించడం, ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలవడం, అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్, రేవంత్ రెడ్డి వంటి వారు వెళ్లి ఎదురుచూసి మరీ చంద్రబాబును కలవడం వంటి పరిణామాలు మహాకూటమికి వ్యతిరేకంగా మారగా టీఆర్ఎస్ కి ఆయుధంలా దొరికాయి.
టీఆర్ఎస్ వర్సెస్ చంద్రబాబులా ఎన్నికలు
కాంగ్రెస్ గతంలో అభివృద్ధి చేయలేదని మాత్రమే కేసీఆర్ కి, టీఆర్ఎస్ కి విమర్శలు చేయడానికి అవకాశం ఉండేది. ఆ విమర్శలు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో గుర్తింపు ఉన్నందున పెద్దగా పనిచేసేవి కాదు. ఇక ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందనేది వాస్తవం. టీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా... ఎన్నికల వేళ ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేరలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. కుటుంబపాలన, ముఖ్యమంత్రి ప్రజల్లో ఉండకపోవడం, తెలంగాణ వ్యతిరేకులకు పదవులు వంటి అంశాలు కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం ఉండేది. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కూడా టీఆర్ఎస్ ను విమర్శించేందుకు కాంగ్రెస్ కి ఆయుధంలా ఉండేది. అయితే, చంద్రబాబు నాయుడు రంగప్రవేశంతో సీన్ టీఆర్ఎస్ వర్సెస్ చంద్రబాబుగా మారిపోయింది. టీఆర్ఎస్ కి ఇది కలిసివస్తుందనే ఉద్దేశ్యంతో కేసీఆర్ సహా ఆ పార్టీ మొత్తం ఎన్నికలను ఇదే టీఆర్ఎస్ వర్సెస్ చంద్రబాబుగానే ప్రొజెక్ట్ చేస్తోంది. చంద్రబాబు నాయుడును బూచీగా చూపిస్తోంది. ఆయన గతంలో తెలంగాణ ప్రాజెక్టులను ఆపడానికి రాసిన లేఖలను సభల్లో ప్రదర్శిస్తోంది. కూటమి గెలిస్తే చంద్రబాబుదే హవా ఉంటుందని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇది కాంగ్రెస్ కి ప్రమాదంగా మారనుంది.
చంద్రబాబు జోక్యం టీఆర్ఎస్ కే మేలు...
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అమరావతికి అప్పజెప్పుదామా అంటున్న కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. పైగా తమకు సీట్లు ముఖ్యం కాదు... కేసీఆర్ ను ఓడించడమే ముఖ్యం అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు చేసిన హితబోధ కూడా తెలంగాణ ప్రజల్లోకి వెళుతోంది. సహజంగానే పార్టీలు, రాజకీయాలు ఎలా ఉన్న ప్రాంతం అనే అంశంలో కేసీఆర్ ని ప్రజలు ఓన్ చేసుకుంటారు. అటువంటిది చంద్రబాబు నాయుడు సీట్లను పట్టించుకోకుండా కేసీఆర్ ను ఓడించాలనే పట్టుదలను ప్రదర్శించడం టీఆర్ఎస్ ప్రజల్లో కొంత ప్లస్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక మొదటి నుంచీ కాంగ్రెస్ కి అండగా ఉన్న ఓ సామాజికవర్గం కూడా చంద్రబాబుతో పొత్తు కారణంగా ఆలోచనలో పడ్డారని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు ఎంత జోక్యం చేసుకుంటే టీఆర్ఎస్ కు అంత మేలు జరుగుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.