బాబు పంతం అందుకోసమే...?
తెలంగాణ ఎన్నికలను తెలుగుదేశం పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ముందు కాంగ్రెస్ తో పొత్తు తెలంగాణ వ్యవహారమన్నట్లుగా చంద్రబాబు నాయుడు వ్యవహరించినా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కలవడం, అశోక్ గెహ్లాట్ అమరావతి వచ్చి చంద్రబాబును కలవడం, సీట్ల సర్దుబాటు, కేటాయింపులో చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఈ ఎన్నికలను ఆ పార్టీ కీలకంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎక్కువగా సీట్లు అడగకుండా గెలిచే స్థానాల్లోనే పోటీ చేయాలని ఆయన నిర్ణయించారు. అందులో భాగంగానే ఆయన ప్రత్యేకంగా సర్వేలు జరిపించుకుని టీడీపీ పోటీ చేయాల్సిన స్థానాలను నిర్ణయించుకుంది. ఇక హైదరాబాద్ లోని సనత్ నగర్ లో మాత్రం కచ్చితంగా పోటీ చేసి గెలవాలని చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఉన్నారట.
టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరి...
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచే సనత్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటివరకు ఈ టిక్కెట్ ఆశించిన మరో నేత కూన వెంకటేష్ గౌడ్ ను సికింద్రాబాద్ కి పంపించి మరీ ఈ సీటును తలసానికి కేటాయించారు. అయితే, గెలిచాక కొన్ని రోజులకే తలసాని చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ మంత్రి పదవిని కూడా చేపట్టారు. అప్పుడు తలసానిపైన టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. వేరే పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని మంత్రిని ఎలా చేస్తారని ప్రశ్నించారు.(తర్వాత ఇదే విధంగా ఏపీలోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు). ఇక అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి అయితే, ఓ రేంజ్ లో తలసాని పై ఫైరయ్యేవారు. ఇక తలసాని కూడా హైదరాబాద్ స్టైల్ లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు నొచ్చుకున్నారట. తాను టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే తనకే మోసం చేశారని బాధ పడ్డారట.
జగన్ ను పరామర్శించడంతో...
ఇక ఇటీవలి పరిణామాలు కూడా చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించాయి అంటున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రికి వచ్చి మరీ పరామర్శించారు. అంతేకాదు చంద్రబాబు వైఖరిని, ఘటన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలను ఎండగట్టారు. తన శత్రువును పరామర్శించి తననే తప్పుపట్టిన తలసాని వైఖరి చంద్రబాబు నాయుడు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఈసారి ఎలాగైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఓడించాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారట. ఇందులో భాగంగానే ఈ స్థానాన్ని టీడీపీకి ఇవ్వాలని కాంగ్రెస్ కి స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి కూన వెంకటేష్ గౌడ్ ను పోటీ చేయిస్తే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్ నుంచి రాజకీయ దిగ్గజం చిన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి స్థానమిది. గెలిచినా ఓడినా సీనియర్ నేత అయినందున ఇక్కడ మరో అభ్యర్థి కాంగ్రెస్ కు లేరు. అయితే, శశిధర్ రెడ్డిని కాదని టీడీపీకి ఈ స్థానం కేటాయించడం కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు మాత్రం కచ్చితంగా టీడీపీకి ఈ స్థానం కావాలని, తలసానిని ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. మరి, చంద్రబాబు నాయుడు పంతం నెరవేరుతుందో లేదో చూడాలి.