Sun Jan 12 2025 19:11:18 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ వీక్నెస్ బయటపడిందా... వారి మాటను కాదనలేకపోయారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూడా ఒక వీక్నెస్ ఉంది. అదీ తనను నమ్ముకున్న వారి మాటను కాదనలేకపోవడం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూడా ఒక వీక్నెస్ ఉంది. అదీ తనను నమ్ముకున్న వారి మాటను కాదనలేకపోవడం. ఇప్పటి వరకూ వైసీపీ అధినాయకత్వం దాదాపు 38 స్థానాలకు ఇన్ఛార్జులను ప్రకటించింది. ఎవరినీ పెద్దగా పట్టించుకోలేదు. చివరకు తాను ఎంతగానో ప్రేమించే మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కూడా అనకాపల్లి బరి నుంచి తప్పించారు. టీడీపీ, జనసేన కూటమి కలసి వస్తుండటంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని జగన్ నిర్మొహమాటంగా చెబుతున్నారు. తన వెంట ఉన్న వారు ఓటమి పాలవ్వకూడదనే తప్పనిసరి పరిస్థితుల్లో మార్చాల్సి వస్తుందని, పక్కన పెట్టాల్సి వస్తుందని జగన్ నేతలకు నేరుగానే చెబుతున్నారు. ఇందులో పెద్దగా దాపరికానికి తావులేదు. శషబిషలకు చోటు ఇవ్వడం లేదు.
కొందరి విషయంలో...
అదే సమయంలో కొందరి విషయంలో మాత్రం జగన్ మెతక వైఖరిని అవలంబించినట్లే రెండో జాబితాను చూసిన తర్వాత అర్థమవుతుంది. ఎక్కడో ఒక చోట మనసులో గూడుకట్టుకున్న అభిమానం అడ్డొచ్చిందనుకుంటున్నారు. అందుకే నేతల మాటలను పెడచెవిని పెట్టలేకపోయారు. దాదాపు ఆరు చోట్ల నేతల వారసులకు ఇన్ఛార్జి పదవిని ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ. అదీ తనను తొలి నుంచి అంటిపెట్టుకున్న నేతలకు మాత్రమే జగన్ ఆ ఆఫర్ ఇచ్చారు. ఆయన ప్రస్తుతుం ఆరుగురి విషయంలో మాత్రం కొంత మెతక వైఖరిని కనపర్చినట్లే కనపడుతుంది. వీరి విషయంలో జగన్ కొంత రాజీపడినట్లు కూడా అగుపిస్తుంది.
వారసులకు...
తిరుపతి నియోజకవర్గం నుంచి భూమన కరుణాకర్ రెడ్డిని తప్పించి ఆయన తనయుడు అభినయ్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. అదే జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాదని ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని నియమించారు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తె నూర్ ఫాతిమాకు అవకాశమిచ్చారు. అదే రకంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తికి సీటు కేటాయించారు. అలాగే తనతో తొలి నుంచి అంటిపెట్టుకుని ఉన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి టిక్కెట్ ఖరారు చేశారు. ఇవన్నీ వాళ్లు కోరినవే. వాళ్లు అడిగిన మేరకే జగన్ నిర్ణయం తీసుకున్నారు.
వ్యతిరేకత ఉంటే తగ్గుతుందా?
అంతే తప్ప ఇక్కడ మార్చడానికి వారిపై ఉన్న వ్యతిరేకత కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తండ్రులపై ఉన్న వ్యతిరేకత వారి వారసులపై పడకుండా ఉంటుందా? అన్న ప్రశ్నకు మాత్రం వైసీపీ నాయకత్వం వద్ద సమాధానం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒకరిపై ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి అదే ఇంట్లో టిక్కెట్ ఇస్తే ప్రజలు ఖచ్చితంగా వ్యతిరుకిస్తారు. కానీ జగన్ ఈ ఆరుగురి విషయంలో ప్రస్తుతానికి తలవొంచారనే చెప్పాలి. ఈ ఆరుగురు వయసు మించిన వారు ఎవరూ లేరు. రాజకీయాలకు పనికిరాని వారు కాదు. కానీ వారిని కాదని వారసులకు ఇచ్చారంటే రానున్న కాలంలో వీరిని పార్టీ సేవలకు ఉపయోగించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని మాత్రం పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద రెండో విడతలో మాత్రం ఆరుగురికి బంపర్ ఆఫర్ జగన్ ఇచ్చారనే చెప్పాలి.
Next Story