కాంగ్రెస్ లిస్ట్ ....ది ....బెస్ట్ ..?
ఎన్నికల వేళ అసమ్మతులు... అసంతృప్తులు సహజం. ఏ పార్టీ అయినా టిక్కెట్ ఆశించి భంగపడ్డవారు పార్టీపైన తిరుగుబాటు బావుటా ఎగరేయడం సాధారణ విషయమే. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే, అసంతృప్తులను పక్కన పెడితే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక గతంలో కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా జరిగినట్లు కనపడుతోంది. 65 మందితో ప్రకటించిన మొదటి లిస్టులో ఎటువంటి ప్రయోగాలకు పోకుండా గెలవడమే టార్గెట్ గా ఆశావహుల బలాబలాలను పూర్తిగా విశ్లేషించి టిక్కెట్లు కేటాయించినట్లు కనిపిస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లు దక్కగా 2009లో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారికి కూడా ఇంచుమించు అందరికీ టిక్కెట్లు దక్కాయి. కొన్నిచోట్ల సీనియర్లుగా ఉన్నందున ఇతరులు బలమైన అభ్యర్థులైనా తప్పనిసరి పరిస్థితుల్లో సీనియర్లకే టిక్కెట్లు ఇచ్చారు.
ఫైరవీలు లేకుండా టిక్కెట్లు...
గతంలో కాంగ్రెస్ టక్కెట్ కావాలంటే ఫైరవీలు చేసుకోగలిగిన వారై ఉండాలి. ఢిల్లీలో అధిష్ఠాన పెద్దల వద్ద పలుకుబడి ఉండాలి. కనీసం ఓ బడా నేత గాడ్ ఫాదర్ గానైనా ఉండాలి. అనేకసార్లు నియోజకవర్గంలో బలం ఉన్న నేతలకు కాకుండా అధిష్ఠానం వద్ద బలం ఉన్న వారికి టిక్కెట్లు దక్కేవి. అయితే, ఈసారి టిక్కెట్ల కేటాయింపు ను పరిశీలిస్తే అటువంటి పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు ఇచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టిక్కెట్లు దక్కని వారు మినహా మిగతా వారంతా టిక్కెట్ల కేటాయింపుపై సంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. రెండుమూడు స్థానాలు మినహా మిగతా అన్ని చోట్ల బలమైన అభ్యర్థులకే టిక్కెట్లు దక్కాయి. ఇందుకోసం కొన్ని నిబంధనలు కూడా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ఒక కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వమనే నిబంధన పార్టీలో ఉంది. అయితే, ఉత్తమ్, కోమటిరెడ్డి, మల్లు కుటుంబాల్లో ఇద్దరి చొప్పున టిక్కెట్లు దక్కాయి. బలమైన అభ్యర్థులైనందునే వీరి విషయంలో ప్రయోగాలకు పోకుండా టిక్కెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మిగిలిన అభ్యర్థుల ప్రకటనలోనూ ఈ నిబంధనను పాటించే అవకాశం కనిపించడం లేదు.
పార్టీకి అండగా ఉన్నవారికి మొండి‘చెయ్యి’
కాంగ్రెస్ పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపిస్తున్న నేతలకు పార్టీ వారి గుర్తైన ‘హ్యాండ్’ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలంధించిన మర్రి శశిధర్ రెడ్డికి ఫస్ట్ లిస్ట్ లో స్థానం దొరకలేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేసిన పీజేఆర్ తనయుడు పీవీఆర్ కి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు కూడా ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కలేదు. పొత్తుల్లో భాగంగా వీరి స్థానాలను ఇతర పార్టీలు ఆశిస్తుండటంతోనే ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టినా వీరికి టిక్కెట్లు కచ్చితంగా దక్కే అవకాశం ఉంది. ఇక పార్టీ తరపున గళం వినిపించే క్రిషాంక్ కి మొండి చెయ్యి చూపింది. ఆయనకు గత ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చి లాక్కున పార్టీ ఈ ఎన్నికల్లోనూ కేటాయించలేదు. మీడియాలో పార్టీ తరపున గట్టిగా మాట్లాడే అద్దంకి దయాకర్ కి ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కలేదు. ఆయన గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ తరపున వివిధ అంశాల్లో విశేష పరిజ్ఞానంతో మాట్లాడే దాసోజు శ్రవణ్ కు, ఎస్టీ సెల్ నేత బెల్లయ్య నాయక్ కు కూడా టిక్కెట్లు దక్కలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో పార్టీకి అండగా పనిచేస్తున్న ఓయూ విద్యార్థి నేతలకు కూడా టిక్కెట్లు దక్కలేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేసి మంచి గులుపు గుర్రాలనే ప్రకటించినా అందరినీ మాత్రం భర్తీ చేయలేకపోయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.