అల్లుడి పంతమే నెగ్గిందిగా....??
ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీల్లాంటి నాయకులు ఓటమి పాలయ్యారు. గెలుపు పక్కా అనుకున్న వారు కారు జోరు ముందు బేజారయ్యారు. ఇటువంటి నియోజకవర్గాల్లో గద్వాల ఒకటి. గద్వాల డీకే అరుణ సంస్థానం అనుకున్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా ప్రజలకు కూడా మొన్నటి ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 28 వేల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించి నాలుగోసారి విజయం తనదే అన్న ధీమాతో ఉన్న డీకే అరుణకు ఆయన భారీ షాక్ ఇచ్చారు. అయితే, డీకే అరుణ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయంటున్నారు.
డీకే కంచుకోటను కూల్చేసి...
గద్వాల నియోజకవర్గం డీకే కుటుంబానికి కంచుకోట వంటిది ఉపఎన్నికలతో కలిపి ఇప్పటికి ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరగగా మొత్తం 10 సార్లు డీకే కుటుంబసభ్యులే విజయం సాధించారు. మొదట డీకే సత్యారెడ్డి, తర్వాత డీకే సమరసింహారెడ్డి, డీకే భరతసింహారెడ్డి విజయం సాధించారు. డీకే భరతసింహారెడ్డి భార్య డీకే అరుణ 1999 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడారు. తర్వాత వరుసగా ఒకసారి సమాజ్ వాది గుర్తుపై, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. మంత్రిగా కూడా పనిచేయడం, తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర స్థాయిలో కీలక నాయకురాలిగా ఎదిగారు. దీంతో ఆమెకు నియోజకవర్గంలో తిరుగులేదని అందరూ అనుకున్నారు. కానీ, డీకే అరుణపై రెండుసార్లు ఓడిన కృష్ణమోహన్ రెడ్డి ఈసారి చాలా కష్టపడ్డారు. దీంతో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు.
రెండుసార్లు ఓడినా...
డీకే భరతసింహారెడ్డి మేనల్లుడైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొదట డీకేతోనే ఉండేవారు. అయితే, అనంతరం విభేదాలు తలెత్తడంతో బయటకు వచ్చి జడ్పీటీసీగా విజయం సాధించారు. అప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో నాయకులతో పరిచయాలు ఉండటంతో ఆయన తనకంటూ ప్రత్యేకంగా క్యాడర్ తయారుచేసుకున్నారు. దీంతో 2009లో టీడీపీ టిక్కెట్ ఆయనకు దక్కింది. ఆ ఎన్నికల్లో అత్త డీకే అరుణ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి... గత ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మళ్లీ అరుణ చేతిలో 8 వేల ఓట్లతో ఓడిపోయారు. ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్న కృష్ణమోహన్ రెడ్డి చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. గ్రామాల్లో పట్టున్న నాయకులను తనవైపు తిప్పుకున్నారు. డీకే అరుణ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
కలిసొచ్చిన సానుభూతి
డీకే అరుణ పేరుకే ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఎన్నికల్లో, ఆ తర్వాత నియోజకవర్గంలో చక్రం తిప్పేది మాత్రం ఆమె భర్త భరతసింహారెడ్డి. ఆయనను దగ్గరగా చూసిన కృష్ణమోహన్ రెడ్డి ఆయన వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నారు. రెండుసార్లు ఓడిన సానుభూతి కూడా ఆయనకు బాగా కలిసివచ్చింది. ఇక కేసీఆర్ ప్రచారం, టీఆర్ఎస్ సంక్షేమ పథకాల పట్ల సానుకూలత ఎక్కువగా ఉండటంతో ఆయన విజయం ఖాయమైంది. పోటీ తీవ్రంగా ఉందని గుర్తించిన డీకే అరుణ గెలుపు కోసం శథవిధాలా ప్రయత్నించినా ఓటమి తప్పలేదు. కానీ, 28 వేల భారీ మెజారిటీతో ఓడిపోతారని మాత్రం ఎవరూ ఊహించలేదు.