ఏనుగు... లయన్... ఆడుకుంటున్నాయిగా..!
తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి టిక్కెట్లు దక్కని నాయకులు రెబెల్స్ గా బరిలోకి దిగారు. వాస్తవానికి పెద్దఎత్తున నేతలు రెబెల్స్ గా నామినేషన్లు వేశారు. అయితే, పార్టీల అధినాయకుల బుజ్జగింపులతో చాలావరకు నేతలు వెనక్కు తగ్గి పార్టీ అభ్యర్థులకు ఇష్టంగానో.. అయిష్టంగానో మద్దతు ఇస్తున్నారు. కానీ, విజయంపై ధీమాగా ఉన్న వారు, తమకు పార్టీ అన్యాయం చేసిందని భావించిన వారు మాత్రం వారి సత్తాను పార్టీకి చూపించాలనుకున్నారు. ఎన్నికల బరిలో దిగారు. ఇక అన్ని రాష్ట్రాల్లో పోటీకి ఎల్లవేళలా సిద్ధంగా ఉండే బీఎస్పీ.. బలమైన నేతలు ఎవరు వచ్చినా బీఫాంలు ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ టిక్కెట్లు దక్కని నేతలు ఏనుగు గుర్తుపై బరిలో ఉన్నారు.
టీఆర్ఎస్ కి రెబెల్స్ సవాల్
ఖైరతాబాద్ లో గత ఎన్నికల్లో పోటీచేసిన మన్నె గోవర్ధన్ రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకుండా దానం నాగేందర్ కి ఇచ్చింది. దీంతో ఎంత బుజ్జగించినా మన్నె వినకుండా బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన భార్య కార్పొరేటర్ కావడంతో, ఉద్యమంలో చురుగ్గా పనిచేయడం, కష్టపడ్డ టిక్కెట్ దక్కలేదనే సానుభూతి ఉండటంతో మన్నె గోవర్ధన్ రెడ్డికి ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక కూకట్ పల్లి టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ పన్నాల హరీష్ చంద్రారెడ్డి కూడా ఏనుగు గుర్తుతో ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్య కూడా కార్పొరేటర్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీలో ఉండాలని నిర్ణయించుకున్న ఆయన రెండు నెలల నుంచి ప్రచారం చేస్తున్నారు. యువతలో మంచి పట్టు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కూకట్ పల్లిలో ఆయన భారీగానే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. మేడ్చెల్ టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించిన నక్కా ప్రభాకర్ గౌడ్ కూడా బీఎస్పీ టిక్కెట్ పై పోటీ చేస్తున్నారు. ఆయన 2009లో టీడీపీ తరపున పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో మంచి పేరు, ప్రత్యేకంగా క్యాడర్ ఉండటంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ రెబల్ రాజారపు ప్రతాప్ కూడా ఏనుగు గుర్తుతో టీఆర్ఎస్ ను ఢీకొడుతున్నారు. ఇక కాంగ్రెస్ తరపున ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఆశించిన మల్ రెడ్డి రంగారెడ్డికి ఇదే పరిస్థితి. ఆయనకు కాంగ్రెస్ బీఫాం దొరక్క బీఎస్పీ బీఫాంపై బరిలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ ఆయనే తమ అభ్యర్థి అని ప్రకటించినా గుర్తు మాత్రం బీఎస్పీ ఏనుగే. దీంతో మూడు రంగుల కాంగ్రెస్ జెండాలో ఏనుగు గుర్తు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు.
మాయవతితో బహిరంగ సభ...
బహుజన సమాజ్ వాది పార్టీకి బడుగు, బలహీనవర్గాల ప్రజల్లో మంచి ఆదరణ ఉంటంది. స్వతంత్రంగా పోటీ చేస్తే అనామక గుర్తు రావడం, గుర్తును ప్రచారం చేసుకోవడం ఇబ్బందిగా మారే అవకాశం ఉండటంతో బీఎస్పీ వైపు మొగ్గు చూపారు. జాతీయ పార్టీ అయిన బీఎస్పీకి ప్రజల్లో గుర్తింపు ఉంది. దీనికి తోడు ఆ పార్టీ తరపున పోటీ చేస్తే ‘ఏనుగు గుర్తు’ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో ‘ఏనుగు’ గుర్తుపై పోటీచేసిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప గెలిచిన సెంటిమెంట్ కూడా ఉంది. దీంతో బలమైన రెబెల్స్ ఏనుగును ఎంచుకున్నారు. కేవలం గుర్తునే కాదు పార్టీ ఇమేజ్ ని కూడా ఉపయోగించుకోవాలని రెబెల్స్ భావిస్తున్నారు. ఇందుకోసం బీఎస్పీ అధినేత్రి మాయావతితో మేడ్చెల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రధాన పార్టీలకు సవాల్ విసరడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె రాక ఇంకా కొత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
‘సింహం’ పంజా విసిరేనా..?
ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఇద్దరు రెబెల్స్ కూడా ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఈ పార్టీకి పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కొంత పట్టుంది. ఈ పార్టీకి ‘సింహం’ గుర్తు ఉండటంతో పలువురు రెబెల్స్ ఇటువైపు కూడా మొగ్గు చూపారు. రామగుండంలో గట్టి పట్టున్న కోరుకంటి చందర్ ఫార్వర్డ్ బ్లాక్ తరపున సింహం గుర్తుతో పోటీలో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో స్పీకర్ మధుసుదనాచారికి భూపాలపల్లిలో గట్టి పోటీ ఇచ్చిన గండ్ర సత్యానారాయణరావుకు టీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన కూడా పులి గుర్తు పైనే బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరు ఉండటంతో భారీగానే ఓట్లు సాధించే అవకాశం ఉంది. మొత్తానికి ఏనుగు, సింహం ప్రధాన పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నట్లే కనిపిస్తోంది.