అత్తకు తగ్గ అల్లుడు....ఎవరిది గెలుపు...??
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తూ... టీఆర్ఎస్ పై అవకాశం దొరికనప్పుడల్లా తీవ్రంగా విమర్శించే వారిని ఈసారి ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ పెద్దలు టార్గెట్ చేశారు. ఇలా టీఆర్ఎస్ టార్గెట్ చేసిన కొన్ని స్థానాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ఒకట. ఇక్కడి నుంచి మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్య నాయకురాలిగా ఉన్న డీకే అరుణ పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. ఆమెను ఓడించేందుకు టీఆర్ఎస్ ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తోంది. ఆమె అల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. గత ఎన్నికల్లో ఓడిన ఆయన ఈ సారి ఎలాగైనా విజయం సాధించి గద్వాలను చేజిక్కించుకోవాలనుకుంటున్నారు.
డీకే కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం
గద్వాల నియోజకవర్గంలో మొదటినుంచి డీకే కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడి నుంచే డీకే కుటుంబం తొమ్మదిసార్లు విజయం సాధించిందంటే వీరి ప్రభావం ఈ నియోజకవర్గంపై ఎంతాలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొదట డీకే సత్యారెడ్డి, తర్వాత ఆయన కుమారులు సమరసింహారెడ్డి, భరతసింహారెడ్డి ఆరుసార్లు విజయం సాధించారు. భరతసింహారెడ్డి భార్యగా రాజకీయ రంగప్రవేశం చేసిన డీ.కే అరుణ వరుసగా మూడుసార్లు విజయం సాధించిన హ్యాట్రిక్ నమోదు చేశారు. 1999లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఆమె ఓడిపోగా, 2004లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో సమాజ్ వాది పార్టీపై గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత 2009, 2014లో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 2009లో రెండోసారి ఎమ్మెల్యే కాగానే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో అవకాశం లభించింది. దీంతో ఆమె జిల్లాలో కీలక నాయకురాలిగా మారారు.
వారంతా టీఆర్ఎస్ వైపేనా..?
గత రెండు ఎన్నికల్లోనూ అల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో డీ.కే.అరుణ తీవ్ర పోటీ ఎదురుకున్నారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన కృష్ణమోహన్ రెడ్డి 10 వేల ఓట్లతో, 2014లో టీఆర్ఎస్ తరపున పోటీచేసి 8 వేల ఓట్లతో ఓటమిపాలయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి స్థానికంగా మంచి పట్టు సంపాదించుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి కూడా కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత ఈసారి కచ్చితంగా గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. ఇక నియోజకవర్గంలో ప్రభావం చూపే స్థాయిలో చేనేత కార్మికులు, కురుమలు, ముస్లింలు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో వీరు లబ్ధిపొందినందున ఎక్కువగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న అంచనాలు ఉన్నారు.
గట్టిపోటీ ఇస్తున్న టీఆర్ఎస్
డీ.కే.అరుణకు ఇవి కీలకమైన ఎన్నికలు. జిల్లా పార్టీపై ఆధిపత్యం సాధించిన ఆమె కచ్చితంగా గెలిస్తేనే ఆమె హవా ఉంటుంది. డీకే కుటుంబానికి ఉన్న పేరుతో పాటు అరుణ వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మంత్రిగా పనిచేసిన సమయంలో అభివృద్ధి చేశారన్న పేరుంది. నియోజకవర్గవ్యాప్తంగా ప్రతీ గ్రామంలోనూ బలమైన క్యాడర్ ఉంది. ఈసారి కూడా తాను గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కీలక పదవి వస్తుందని, నియోజకవర్గం ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగానే ఏర్పడే వ్యతిరేకత, కొత్తవారికి అవకాశం ఇద్దామని ప్రజల్లో ఉండే భావన, టీఆర్ఎస్ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు ఎక్కువగా ఉండటం, కృష్ణమోహన్ రెడ్డి మరింత బలమైన అభ్యర్థిగా మారడం డీ.కే.అరుణకు ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి డీకే అరుణ ఈసారి గత మూడు పర్యాయాల్లో లేనంత టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి డీకే అరుణకు మొగ్గు ఉన్నా... టీఆర్ఎస్ విజయావకాశాలను కొట్టి పారేయలేం.