గాలికి ఎదురెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే...!
రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎవరు ఎవరికి సన్నిహితులు అవుతారో? ఎవరు ఎవరికి శత్రువులు అవుతారో? చెప్పడం కష్టం. నా అనుకున్నవారు సమయానికి హ్యాండిచ్చేది ఒక్క రాజకీయాల్లోనే అంటారు అనుభవజ్ఞులు. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌నే ఎదుర్కొంటున్నారు గనుల కింగ్, కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాకు చెందిన బీజేపీ నేత గాలి జనార్దన రెడ్డి. తనకు ప్రియ మిత్రుడు, తన ఆశీస్సులతోనే రాజకీయాల్లో ఎదిగిన నాయకుడు.. ఒక్కసారిగా ఇప్పుడు తనకు హ్యాండిచ్చేసరికి.. గాలికి మతి పోయినంత పనైంది. విషయంలోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్, గాలి జనార్దన్‌రెడ్డి చాలా కాలంగా సన్నిహితులు.
టిక్కెట్ ఇప్పించింది గాలి....
2014 ఎన్నికల్లో జయరామ్‌కు ఆలూరు వైసీపీ టిక్కెట్ రావడంలో గాలి జానార్దన్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జయరామ్ రాజకీయ ఎదుగుదల వెనుక గాలి జనార్దన్‌రెడ్డి పాత్ర అత్యంత ప్రధానమైనది. గతంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌కి టీడీపీలోకి వెళ్లడానికి ఆఫర్ వచ్చింది. అయితే, ఈ విషయం తెలియగానే గాలి జనార్దన్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే జయరామ్ టీడీపీలోకి వెళ్లే ప్రయత్నానికి బ్రేక్ పడింది. సో.. గాలి మాట వినేందుకు జయరామ్ ఇచ్చే ప్రాధాన్యం ఇది. అయితే, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు అవసరం వస్తే.,. యూటర్న్ తీసుకోవడం రాజకీయాల ప్రధాన లక్షణం. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికలు వీరిద్దరి మధ్య ఇలానే యూటర్న్ తీసుకునేలా చేశాయి.
సోదరుడికే సాయంగా....
జయరామ్ తమ్ముడైన నాగేంద్ర బళ్లారి రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. అదే నియోజకవర్గంలో గాలి జానార్దన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు మామ అయిన పక్కిరప్ప పోటీ పడ్డారు. అయినప్పటికీ.. తన వారిని గెలిపిం చుకునేందుకు జయరామ్.. స్కెచ్ లు వేశారు. పోటీ లో ఉన్నవారు ఎవరైతే నాకెందుకు నావారే నాకు ముఖ్యం గా అనే విధంగా జయరామ్ తన వ్యూహాన్ని అమలు చేశారు. దీంతో గాలి నేరుగా రంగంలోకి దిగారు. ఫలితంగా ఇద్దరి మధ్య ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగిం ది. పక్కిరప్పపై 2500 ఓట్ల మెజారిటీతో నాగేంద్ర గెలుపొందారు. మరోవైపు ఎమ్మెల్యే జయరామ్ అల్లుడైన మురళీకృష్ణ సిరిగుప్ప అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా.....
అక్కడ బీజేపీ అభ్యర్ధి సోమలింగప్ప చేతిలో ఆయన ఓటమి చవిచూశాడు. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో.. సిరుగుప్ప కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని చేపట్టిన ఎమ్మెల్యే జయరామ్ బళ్లారి రూరల్, సిరుగుప్ప అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా గట్టి ప్రచారాన్నే నిర్వహించారు. దీంతో గాలి జనార్దన్‌రెడ్డి బలపరిచిన బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే జయరామ్‌పై మండిపడ్డారట. ఈ పరిస్థితి గాలి జనార్దన్‌రెడ్డి, జయరామ్ మధ్య చిచ్చుపెట్టింది. మొత్తంగా ఇప్పుడు గాలి అనుచరులు మాత్రం నమ్మిన వారే తమ నాయకుడు(గాలి)ని వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. మొత్తంగా ఈ పరిణామం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
- Tags
- aluru
- andhra pradesh
- ap politics
- gali janardhan reddy
- gummanuru jayaram
- karnatka
- krunool
- nara chandrababu naidu
- telugudesam party
- y.s.jagan mohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఆలూరు
- ఏపీ పాలిటిక్స్
- కర్ణాటక
- కర్నూులు
- గాలి జనార్థన్ రెడ్డి
- గుమ్మనూరు జయరామ్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ