హరీశ్ ను చూస్తే... వాళ్లే గుర్తొస్తున్నారే..!
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసుడిగా... తెలంగాణ రాష్ట్ర సమితి భావి సారథిగా... కేటీఆర్ ఇక పక్కా అని తేలిపోయింది. ఇంతకాలం కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అవుతారా లేదా హరీశ్ రావు అవుతారా..? అనుమానాలకు కేసీఆర్ ఇవాళ ఉదయం ఒక క్లారిటీ ఇచ్చారు. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన ఇవాళే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కొత్తగా ఏర్పాటుచేసి కేటీఆర్ కు అప్పగించారు. దీంతో ఇక టీఆర్ఎస్ ఫ్యూచర్ లీడర్ కేటీఆర్ అనే ఒక సంకేతం పార్టీ శ్రేణుల్లోకి వెళ్లింది. అయితే, ఈ నియామకం జరగగానే కేటీఆర్ తన బావ హరీశ్ రావు ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. హరీశ్ కూడా కేటీఆర్ కు మొదట ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా బాగానే ఉంది... ఇప్పుటికైతే బాగానే ఉంది... కానీ భవిష్యత్ లోనూ వీరిద్దరూ ఇలానే కలిసిమెలసి ఉంటారా..? బావమరిదికి బావ సహకారం ఉంటుందా..? మరి, బావ భవిష్యత్ ఏంటి..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మామకు తగ్గ అల్లుడిగా...
కేసీఆర్ కు మొదటి నుంచి అత్యంత నమ్మకస్తుడిగా, అనుచరుడిగా కొనసాగుతూ వస్తున్నారు. హరీశ్ రావు. కేసీఆర్ వదిలిన సిద్ధిపేటలో ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. ఉద్యమంలో మొదటి నుంచీ కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేశారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. ఒకరకంగా టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందారు. పార్టీ బలంగా లేని నియోజకవర్గాలు, ప్రాంతాల్లో హరీశ్ రావు ఎంటర్ అయ్యారంటే ఇక పార్టీకి తిరుగులేనట్లే. ఆయన ట్రాక్ రికార్డులో ఇలాంటి విజయాలు అనేకమే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లోనూ ఆయన పలు నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుని సమర్థంగా నిర్వర్తించారు. అదే సమయంలో కేటీఆర్ కూడా హరీశ్ లానే జీహెచ్ఎంసీ ఎన్నికలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకున్న బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి తన సత్తాను నిరూపించుకున్నారు.
సొంతంగా పార్టీ పెట్టుకున్న రాజ్ థాక్రే...
అయితే, కేటీఆర్ తో కలిసి పనిచేస్తానని హరీశ్ రావు కచ్చితంగా చెబుతున్నారు. కానీ, ఇవాళ ఉన్న మాట ఎప్పటికీ ఉంటుందా అనేది అనుమానమే. గతంలో ఇటువంటి పరిణామాలు వివిధ పార్టీల్లో నెలకొన్నాయి. మహారాష్ట్రలో బాల్ థాక్రేకి ఆయన సోదరుడి కుమారుడు రాజ్ థాక్రే కూడా కుడి భుజం లానే ఉండేవారు. బాల్ థాక్రే వాక్పటిమ, హావభావాలు, ఆలోచన విధానం అన్ని రాజ్ థాక్రేలో ఉన్నాయి. బాల్ థాక్రేలానే రాజ్ థాక్రే కూడా మంచి కార్టూనిస్టు. శివసేనలో కీలక నేతగా ఎదిగారు. ప్రచారం కూడా నిర్వహించే వారు. అయితే, బాల్ థాక్రే కుమారుడు ఉద్దవ్ థాక్రే రాజకీయాల్లో, శివసేన వ్యవహారాల్లో కీలకంగా మారిన తర్వాత అతడితో రాజ్ థాక్రేకి వివాదాలు వచ్చాయి. పార్టీ కోసం తాను ఇంత కష్టపడితే తనను పక్కన పెట్టి ఉద్ధవ్ కి ప్రాధాన్యత పెరిగడాన్ని జీర్ణించుకోలేక ఆయన 2006లో శివసేన నుంచి బయటకు వచ్చి మహారాష్ట్ర నవ నిర్మాణసేన పేరుతో మరో పార్టీ పెట్టుకున్నారు. బాల్ థాక్రే, ఆయన భావాలకు అసలైన వారసుడినే నేనే అని ఆయన చెప్పుకుంటారు. రాజ్ థాక్రేతో పాటు శివసేన నుంచి చాలా మంది నేతలు, క్యాడర్ వెళ్లిపోయారు. మొదట కొన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రభావం చూపిన ఆ పార్టీ తర్వాత నామమాత్రమైంది.
పంజాబ్ లోనూ అదే సీన్... మరి ఇక్కడ..?
ఇక, పంజాబ్ లోనూ ఇటువంటి ఉదాహరణనే ఉంది. శిరోమణి అకాలీదళ్ పార్టీలో కీలకంగా పనిచేసిన ఆ పార్టీ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ సోదరుడి కుమారుడు మన్ ప్రీత్ సింగ్ బాదల్ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. మూడుసార్లు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రకాశ్ బాదల్ కు చాలా నమ్మకస్తుడిగా మారారు. 2007లో పంజాబ్ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, కొంతకాలానికి ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ తో విబేదాల కారణంగా పార్టీని వీడారు. తర్వాత పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ పేరుతో పార్టీ పెట్టి 2012 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనే స్వయంగా ఓడిపోగా ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 6 శాతం ఓట్లు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ రెండు ఘటనల్లో పార్టీ అధినేతలు తమ రాజకీయ వారసుల ఎంపిక విషయంలో, తర్వాత కూడా సొంత కుమారుల వైపే నిలిచారు. దీంతో వీరిద్దరూ వారి పార్టీల కోసం ఎంత కష్టపడ్డా పరాయి వారిగానే మిగిలిపోయారు. తర్వాత వీరిద్దరూ ఆయా పార్టీలు వదిలి బయటకు రావాల్సి వచ్చింది. ఇక, తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్ అల్లుడు హరీశ్ రావు ప్రస్థుతానికి కేటీఆర్ తో కలిసి పనిచేస్తానని గట్టిగా చెబుతున్నారు. మరి, భవిష్యత్ లోనూ ఇలానే ఉంటారా లేదా రాజ్ థాక్రే, మన్ ప్రీత్ లాగా బయటకు వచ్చి తన దారి తాను చూసుకుంటారో చూడాలి.