హరీష్ అడ్డాలో ప్రస్తుత పరిస్థితేంటి..?
సిద్ధిపేట.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది హరీష్ రావు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన హరీష్ రావు సిద్ధిపేటను కంచుకోటగా మల్చుకున్నారు. సిద్ధిపేట అంటే హరీష్ రావు... హరీష్ రావు అంటే సిద్ధిపేట అనేలా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట కేసీఆర్, ఇప్పుడు హరీష్ రావు సిద్దపేటలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇందుకు కారణం అభివృద్ధి మంత్రమే. కేసీఆర్ కానీ, ఇప్పుడు హరీష్ రావు కానీ సిద్ధిపేటను అభివృద్ధిలో ముందుంచారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు సిద్ధిపేట తరహాలో అభివృద్ధి చేస్తామని వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారంటే సిద్ధిపేట అభివృద్ధికి ఒక మోడల్ నియోజకవర్గంగా తెలంగాణలో మారింది.
ప్రభుత్వం ఏదైనా... అభివృద్ధిలో ముందుంది
సిద్ధిపేటలో హరీష్ రావు 2004 నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా... ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో హరీష్ రావు చాలా చొరవ తీసుకున్నారు. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండటం, హరీష్ మంత్రిగా ఉండటంతో ఈ నాలుగున్నరేళ్లలో మరింత అభివృద్ధి జరిగింది. ఈ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో టీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో కచ్చితంగా గెలవబోయే స్థానం సిద్ధిపేటనే అని టీఆర్ఎస్ భావిస్తోంది. 1985లో మొదటిసారి కేసీఆర్ సిద్ధిపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత ఆయన 1989, 94, 99 ఎన్నికలతో పాటు 2001, 2004 ఉప ఎన్నికల్లోనూ వరుసగా ఆరుసార్లు విజయం సాధించి 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఆయన మేనల్లుడు హరీష్ రావు సిద్ధిపేటలో కేసీఆర్ వారసత్వాన్ని కొనసాగించారు. ఆయన 2004 ఉపఎన్నికల నుంచి వరుసగా ఐదుసార్లు ఇక్కడి నుంచి విజయపతాకం ఎగరవేశారు. చివరగా 2014లో హరీష్ రావు ఇక్కడి నుంచి 93,328 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంటే 1985 నుంచి ఇప్పటివరకు సిద్ధిపేట వీరి చేతిలోనే ఉంది.
ఈసారి లక్ష మెజారిటీ కావాలని...
ముఖ్యంగా సిద్ధిపేట పట్టణం అభివృద్ధిలో మిగతా పట్టణాల కంటే ఎంతో ముందుంది. ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. కేవలం సిద్ధిపేట పట్టణం మాత్రమే కాదు.. ఈ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలు సైతం బాగా అభివృద్ధి చెందాయి. దీంతో టీఆర్ఎస్ కు, ముఖ్యంగా హరీష్ రావు ఇక్కడ తిరుగులేకుండా పోయింది. అందుకే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడి ప్రజలు హరీష్ రావు పట్టం కడుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించాలని హరీష్ రావు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరిని కదిపినా తమ మద్దతు హరీష్ రావుకే అంటున్నారు. అయితే, ఎలాగూ గెలుపు ఖాయం కావడంతో ఆయన సిద్ధిపేటపై ఎక్కువ దృష్టి సారించడం లేదు. గజ్వెల్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హరీష్ రావుకు ప్రత్యర్థిగా ప్రజాకూటమి తెలంగాణ జన సమితి నుంచి భవానిరెడ్డిని నిలబెట్టారు. ఎన్ఆర్ఐ అయిన ఆమె గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. హరీష్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఆమె కష్టపడుతున్నా ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.