Fri Nov 15 2024 09:39:36 GMT+0000 (Coordinated Universal Time)
ఆశ్చర్యమేముంది?
ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. నోరు వెళ్లబెట్టాల్సిన స్థితి అంతకంటే లేదు. టీడీపీ, జనసేన కలసి వెళతాయన్నది అందరూ ఊహించిందే
ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. నోరు వెళ్లబెట్టాల్సిన స్థితి అంతకంటే లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన కలసి వెళతాయన్నది అందరూ ఊహించినదే. జనసేన పవన్ కల్యాణ్ ఈరోజు అధికారికంగా తాము పొత్తుతో వెళతామని ప్రకటించినప్పటికీ గత కొద్ది రోజుల ముందే పొత్తు ఖరారయిందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఎన్నికల సమయంలో పొత్తులంటూ వాయిదా వేస్తూ వస్తున్న జనసేనాని ఎట్టకేలకు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు బరస్ట్ అయ్యారు. చంద్రబాబును జైలులో పరమార్శించేందుకు వచ్చిన పవన్ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో కలసి వెళతాయని చెప్పడం అధికారిక ముద్ర వేయడమే తప్ప మరేదీ కొత్త విషయమేమీ కాదు.
గత ఏడాది నుంచే...
ఎందుకంటే వీరి పొత్తుకు గత ఏడాది బీజం పడిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ ను విశాఖలో అడ్డుకున్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వెళ్లి జనసేనానిని పరామర్శించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ రెండు సార్లు హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చలు జరిపి వచ్చారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో రెండు పార్టీలూ బయటకు చెప్పకపోయినా లోపాయికారీగా పొత్తులు కుదుర్చుకున్నాయనే అంచనాలు, విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే తనకు తన పార్టీకి పట్టున్న తూర్పు గోదావరి జిల్లాలోనే ఈ అధికారిక ప్రకటన చేయడం విశేషంగా చూడవచ్చు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే పవన్ ఈ ప్రకటన చేసి ఉంటారని జనసేన నేతలు భావిస్తున్నారు.
ఆవేశంతో కూడిన...
పవన్ కల్యాణ్ ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెబుతారు. తడవకో నిర్ణయం తీసుకునే వారిని జనం ఎంత మేరకు విశ్వసిస్తారన్నది భవిష్యత్ లో తేలాల్సి ఉంది. రాజకీయాల్లో ఆవేశం అస్సలు పనికి రాదు. ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. యుద్ధతంత్రం తెలిసిన వాళ్లెవ్వరూ నిర్ణయాలను అప్పటికప్పుడు తీసుకోరు. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించిన వారే రాజకీయంగా ఎదుగుతారు. కానీ పవన్ లో అది ఎంత మాత్రం కన్పించదు. జైలు లోపలి నుంచి హడావిడిగా పొత్తు ఉంటుందని హడావిడిగా ఆవేశంగా ఈ పొత్తు విషయం ప్రకటించాల్సిన అవసరం లేదు. పార్టీ నేతలతో చర్చించి తీసుకుంటే కొంత ప్రజాస్వామ్య బద్ధంగా ఉండేదన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.
ఓట్లు బదిలీ అవుతాయా?
పొత్తులు కుదుర్చుకున్నంత మాత్రాన సరిపోదు. కలసి పోటీ చేసినంత మాత్రాన గెలవడం సులువు కాదు. ఓట్లు ఒక పార్టీకి మరొకరు బదిలీ అయితేనే విజయం సాధ్యమవుతుంది. అగ్రనాయకులు కలిసినంత మాత్రాన గెలుపు దరిచేరదన్న సంగతి గతంలో అనేక ఎన్నికల్లో స్పష్టమయింది. ఇప్పుడు కూడా రెండు పార్టీలూ తమ ఓటు బ్యాంకు ఒకరినొకరు బదిలీ చేసుకోగలిగితేనే జగన్ ను దెబ్బకొట్టడం సాధ్యమవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అంతేకాదు సీట్ల పంపకాల ప్రక్రియ కూడా సాఫీగా సాగాలి. ఒకరినొకరు ఓడించే పరిస్థితికి రాకుండా, రెండు పార్టీల క్యాడర్, లీడర్లు ఐక్యంగా నడిస్తే కొంత సానుకూల ఫలితాలు సాధించే అవకాశాలు లేకపోలేదు.
బీజేపీ దారెటు?
అదే సమయంలో ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకుంటే మాత్రం వ్యతిరేక ఓటు చీలకూడదన్న మాట సంగతి ఎలా ఉన్నా తమ పార్టీకి భవిష్యత్ ఉండదని కూడా జనసేన నేత ఒకరు అభిప్రాయపడటం విశేషం. జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయన్న దానిపై క్లారిటీ వచ్చింది. ఇక బీజేపీ వీరితో కలసి వస్తుందా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. బీజేపీ కలవకుంటే వామపక్షాలు కూడా ఈ కూటమితో నడవనున్నాయి. బీజేపీ కలిస్తే మాత్రం లెఫ్ట్ పార్టీలు విడిగా పోటీ చేయనున్నాయి. ఏపీ రాజకీయ ముఖచిత్రం ఎన్నికలకు తొమ్మిది నెలలు ముందుగానే ఒక క్లారిటీ వస్తుండటం. ఈ కలయిక ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్నది ఇప్పుడే అంచనా వేయలేం కాని, ఈసారి పోరు మాత్రం మామూలుగా ఉండదన్నది యదార్థం.
Next Story