జగన్ ది వన్ వే...అంతే...?
వైసీపీ తన వైఖరిని స్పష్టం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కలసి పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. గత కొన్నాళ్లుగా వైసీపీ, బీజేపీకలసి పోటీ చేస్తాయన్న ప్రచారం తెలుగుదేశం పార్టీ విపరీతంగా చేస్తూ వస్తోంది. జగన్ తన కేసుల గురించే మోడీతో లాలూచీ పడ్డారని, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలసి పోటీ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయని భావించిన వైసీపీ నేతలు దీనిపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించారు.
ఎవరితో పొత్తు ప్రసక్తి లేదు....
వచ్చే ఎన్నికల్లో తాము ఏ రాజకీయ పార్టీతోనూ కలసి నడచే ప్రసక్తి లేదని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండానే ఒంటరిగా బరిలోకి దిగే ధైర్యం, దమ్ము తమకుందని, గత ఎన్నికలను చూసే అర్థం చేసుకోవాలంటూ ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా బరిలోకి దిగే ధైర్యం లేదని కూడా ఆయన అన్నారు. టీడీపీ చరిత్ర చూస్తేనే అది అర్థమవుతుందని, ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ ఎప్పుడూ గెలవలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మోడీతో చేతులు కలిపారంటూ.....
అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. సహజంగా అధికార పార్టీ వైసీపీని విమర్శించడానికి ఏమీ ఉండదు. జగన్ పాదయాత్రలో ఉండటంతో దానిపై విమర్శించే పరిస్థితి లేదు. తొలినాళ్లలో కొన్నివిమర్శలు చేసినా పాదయాత్రపై విమర్శలను ఇప్పుడు టీడీపీ నేతలు పక్కన పెట్టారు. ఇక బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయమంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన, చేస్తున్న మోడీ పార్టీతో చేతులు కలపడానికి ఫ్యాన్ పార్టీ ప్రయత్నిస్తుందన్నది టీడీపీ నేతల వాదన. ప్రధాన మంత్రి కార్యాలయంలోకి ఆ పార్టీ నేతలు నేరుగా ప్రవేశిస్తున్నారంటే ఇంతకంటే మించి నిదర్శనమేముందని ప్రశ్నిస్తున్నారు.
ఎవరు సాహసిస్తారు?
కాని ఇప్పడు కమలం పార్టీతో చేయి కలపడానికి ఏపీలో ఏ పార్టీ సాహసించలేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేస్తే మాడి మసవ్వడం ఖాయమన్నది కూడా రాజకీయ నేతలకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో జగన్ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారని ఆ పార్టీ నేతలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ తాము ఒంటరిగానే బరిలోకి దిగామని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని పదే పదే చెబుతున్నారు. ఏపీలో ఉన్న వామపక్షాలు జనసేనతో కలిశాయి. కాంగ్రెస్ పార్టీతో కూడా ఎవరూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు. బీజేపీతో చేతులు కలుపుతున్నారన్న టీడీపీ వాదనను వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నా...ఎన్నికల అనంతరం ఉండొచ్చన్న అనుమానాలనయితే ప్రజల్లోకి టీడీపీ తీసుకెళ్లగలిగిందనే చెప్పాలి. అయితే ప్రత్యేక హోదా ఇస్తే తాను ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటానన్న జగన్ వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయని అంటున్నారు.