జనసేన గూటికి మాజీ మంత్రి.. చేరికే బ్యాలెన్స్...!
2019 ఎన్నికల్లో కీలకంగా మారుతుందని భావిస్తున్న జనసేన వైపు సీనియర్ నేతలు చూస్తున్నారా? ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? ముఖ్యంగా కుల రాజకీయాలకు తాను దూరమని పార్టీ అధినేత పవన్ చెబుతున్నా.. ఆయన సామాజిక వర్గ నేతలు పవన్‌కు మరింత దగ్గర అవుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఏపీలోని ముఖ్య రాజకీయ పార్టీల్లోకి వలసలు జోరందుకున్నాయి. కీలకమైన సమయం కావడంతో పార్టీల అధినేతలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారు.
మళ్లీ బలం పుంజుకునే అవకాశం లేదని.....
విభజన దెబ్బతో 2014 ఎన్నికల్లో ఏపీలో కుదేలయిపోయిన కాంగ్రెస్.. మళ్లీ బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా అవేమీ ఫలితం ఇవ్వడం లేదు. దీంతో ఆ పార్టీలో ఇప్పటివరకూ కొనసాగుతున్న సీనియర్లు.. ప్రత్యామ్నాయం కోసం వేచిచూస్తున్నారు. ఆ పార్టీలోని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఇప్పుడు జనసేనలోకి వెళతారనే ప్రచారం జోరందుకుంది. ఐసీయూ స్టేజీ నుంచి ఇంకా కాంగ్రెస్ కోలుకోవడం లేదు. ఆ పార్టీ పరిస్థితి గమనించిన నేతలంతా ముందే తలో పార్టీలో చేరిపోయారు. మిగిలిన వారు ఎటూ తేల్చుకోలేక పార్టీలోనే కొనసాగుతున్నా.. కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. సరైన ప్రత్యామ్నాయం కోసం వేచిచూస్తున్నారు. ఇప్పుడు వీరికి జనసేన కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు.
కాంగ్రెస్ లో లైఫ్ లేదని తెలిసి......
కాంగ్రెస్‌లో లైఫ్ లేకపోవడంతో చాలా మంది 2019లో తమ అదృష్టాన్ని జనసేన నుంచి పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఈ రేసులో పవన్ సామాజికవర్గ నేతలే ఎక్కువగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. జనసేనలో చేరేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారని, వీరంతా పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూ స్తున్నారని తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై ప్రస్తుతం దృష్టిపెట్టిన పవన్.. దీనిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈలోగానే నేతలు తమ ప్రయత్నాల్లో ఉంటున్నారు.
పవన్ తో భేటీ తర్వాత....
ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ జనసేనలో చేరనున్నట్టుగా వార్తలు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. విశాఖ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో వట్టి సమావేశం అయిన దగ్గర నుంచి ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ఉన్నారు. రెండు రోజుల క్రితం విశాఖలో పవన్‌తో సమావేశమయ్యారు. అక్కడ అంబేద్కర్ భవన్‌కు వెళ్లి వట్టి పవన్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో వట్టి జనసేనలోకి చేరవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సామాజికవర్గ సమీకరణాల రీత్యా కూడా ఆయన జనసేనలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
రెండుసార్లు గెలచి మంత్రిగా.....
గతంలో వసంత్ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి విజయం సాధించారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం వట్టి వసంతకుమార్ కాంగ్రెస్‌తో పాటు ఉండటంతో రాజకీయంగా కొంత వెనుకబడ్డారు. ఇప్పుడు జనసేనలో చేరిక ద్వారా తిరిగి జోష్ మీదకు రావొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తను పార్టీ మారబోతున్నానంటూ వస్తున్న ఊహాగానాలను వట్టి ఖండించారు. పవన్ కల్యాణ్ తో రాజకీయాలేమీ చర్చించలేదని, మర్యాదపూర్వకంగానే తను పవన్ కళ్యాణ్‌ను కలిశానని వట్టి చెప్పారు. స్వయంగా వట్టి ఈ ప్రచారాన్ని ఖండించినా, పవన్ కల్యాణ్ బస్సు యాత్రను మొదలుపెట్టాక ఆయన జనసేనలోకి చేరవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.
రీఎంట్రీపై క్లారిటీ.....
పవన్ జనసేనలో చేరలేదని చెపుతున్నా వాస్తవానికి ఆయన కొద్ది రోజుల క్రితం తన స్వగ్రామం అయిన పల్లపూరులో గతంలో తాను మంత్రిగా పనిచేసినప్పుడు తన అనుచరులుగా ఉన్న కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తన పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఉంగుటూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు పవన్‌ను కలవడంతో ఆయన జనసేనలో చేరడం దాదాపు ఖరారైనట్టే అన్న టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది.