జనగామ జనం వారివైపేనా..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ గా ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన రెండు నెలలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మహాకూటమిలో ఎక్కడా లేని ప్రతిష్ఠంభన జనగామ నియోజకవర్గంలో నెలకొంది. కాంగ్రెస్ నుంచి ఇక్కడ సీనియర్ నేత, మాజీ మంత్ర పొన్నాల లక్ష్మయ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. మొన్నటివరకు ఆయన తప్పించి ఇక్కడ మరో వ్యక్తి టిక్కెట్ రేసులో లేరు. దీంతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మహాకూటమిలో భాగంగా జనగామ స్థానం తెలంగాణ జన సమితికి వెళుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పొన్నాల కూడా టిక్కెట్ వస్తుందా లేదా అనే డైలమాలో పడ్డారు.
ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా...
పొన్నాల లక్ష్మయ్య పార్టీలో సీనియర్ నాయకులు. జనగామ నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక పీసీసీ తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే, పీసీసీ అధ్యక్షుడి హోదాలో పోటీచేసిన ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పొన్నాల లక్ష్మయ్యపై టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 32 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బరిలో ఉన్న యాదగిరి రెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. యాదగిరిరెడ్డిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, అభివృద్ధి విషయంలో మాత్రం ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. పైగా జనగామ జిల్లాగా ఏర్పడటం కూడా కలిసివస్తుందని నమ్మకంగా ఉన్నారు.
కోదండరాం రంగంలోకి దిగుతారా..?
ఓవైపు టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండగా... పొన్నాలపై సానుకూలత కూడా ఎక్కువేం లేదు. ఈ నాలుగేన్నరేళ్లుగా కూడా ఆయన ప్రజల్లో అంతగా తిరగలేదు. కానీ, నియోజకవర్గంలో గ్రామగ్రామాన క్యాడర్ ఉండటం, గతంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం, ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కలిసివస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా... కోదండరాం పేరు వినిపిస్తుండటంతో పొన్నాలకు మింగుడు పడటం లేదు. సీనియర్ బీసీ నేత అయిన తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం సరికాదంటున్నారు. అయితే, ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ప్రభావం చూసే స్థాయిలో ఉండటం, గతంలో తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగడం, ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఇవ్వన్నీ కోదండరాంకి కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే, జనగామ సీటును ఎంచుకున్నారని తెలుస్తోంది.
త్రిముఖ పోటీ ఖాయం...
అయితే, టిక్కెట్ ఏ పార్టీ..? ఎవరికి..? అనే క్లారిటీ లేక మహాకూటమి ప్రచారంలో వెనకబడింది. ఇది టీఆర్ఎస్ అభ్యర్థికి కలిసివస్తుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి పోటీచేసి 21 వేల ఓట్లు సాధించారు. ఇప్పుడు ఆయన బీజేపీలో లేకున్నా... బీజేపీతో పొత్తులో ఉన్న యువ తెలంగాణ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనకు చేర్యాల, బచ్చన్నపేట మండలాల్లో మంచి పట్టుంది. మొత్తానికి జనగామ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండటం ఖాయంగా కనపడుతోంది.