ఫస్ట్ లిస్ట్ లో చోటు వీరికేనా..?
తెలంగాణ క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కనుంది..? గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారికి మళ్లీ బెర్త్ దక్కుతుందా..? కొత్తవారికి ఎవరెవరికి అవకాశం ఉంటుంది..? గులాబీ బాస్ మదిలో ఎవరున్నారు..? ఈ ప్రశ్నలు టీఆర్ఎస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించి వారం రోజులు గడుస్తోంది. అయితే, కేబినెట్ కూర్పు మాత్రం ఓ కొల్లిక్కిరాలేదు. కేసీఆర్ తో పాటు ఆయనకు అత్యంత విశ్వసనీయుడిగా గుర్తింపు పొందిన మహ్మద్ మహబూద్ అలీకి మాత్రమే మంత్రి పదవి దక్కింది. అయితే, వారం లోపే పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటుచేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు కేవలం 8-9 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నందున సగం మంత్రి పదవులు భర్తీ చేసి మిగతా సగం పెండింగ్ లో పెట్టాలని ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు దక్కితే తమకు ఎక్కడ చేజారిపోతుందోనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మరోవైపు ఈసారి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదంటున్నారు.
రెడ్డి నేతల్లో తీవ్ర పోటీ...
మొదటి విడతలో రెడ్డి సామాజకవర్గానికి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోయినసారి హోంమంత్రిగా పనిచేసిన నాయిని నరసింహారెడ్డిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. ఇక మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి మళ్లీ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరికి తోడు ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా రేసులో ముందున్నారు. ఇక కేసీఆర్ కి సన్నిహితుడిగా పేరున్న వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీరిలో ఫస్ట్ ఫేజ్ లో ఎవరికి అవకాశం దక్కుతుందోనని ఆశావహుల్లో టెన్షన్ పట్టుకుంది.
ఫస్ట్ లిస్టులో కేటీఆర్ ఉండరా..?
వెలమ సామాజకవర్గంలో కూడా ఫస్ట్ లిస్ట్ లో ఇద్దరికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే, హరీశ్ రావు, కేటీఆర్ కి మంత్రి పదవులు దక్కడం ఖాయం. గత కేబినెట్ లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన స్థానంలో వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి ఆయనకు కలగానే మిగిలిపోయింది. దీంతో ఆయనకు ఈసారి బెర్త్ కన్ ఫర్మ్ అంటున్నారు. అయితే, ప్రస్తుతం పార్టీ పనుల్లో బిజీగా ఉన్న కేటీఆర్ సెకెండ్ ఫేజ్ లో మంత్రి పదవి తీసుకుంటే హరీశ్ రావుతో పాటు ఎర్రబెల్లికి మొదటి లిస్టులోనే అవకాశం దక్కనుంది. కమ్మ సామాజకవర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఓడిపోవడంతో ఈ కోటాలో ఖమ్మం జిల్లాకే చెందిన పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. హైదరాబాద్ లో గెలిచిన ఆ సామాజకవర్గ ఎమ్మెల్యేలు కూడా రేసులో ఉన్నా అజయ్ ముందున్నట్లు కనిపిస్తోంది. కానీ, తుమ్మలను ఎమ్మెల్సీని చేసి మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారమూ జరుగుతోంది.
ఆరుగురిలో ఆ ఇద్దరూ ఎవరో...
బీసీ కోటాలోనూ రెండు మంత్రి పదవులు ఫస్ట్ ఫేజ్ లో దక్కే అవకాశం ఉండగా పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, జోగు రామన్న, పద్మారావు గౌడ్, శ్రీనివాస్ యాదవ్ మళ్లీ పదవులు ఆశిస్తున్నారు. ఈటెలకు మంత్రి పదవి ఖాయమే అని తెలుస్తున్నా ఆయనను స్పీకర్ గా పంపించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక దానం నాగేందర్, ధాస్యం వినయ్ భాస్కర్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆరుగురిలో ఫస్ట్ లిస్ట్ లో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎస్సీ సామాజకవర్గంలో ఈసారి కడియం శ్రీహరితో పాటు రాజయ్య, కొప్పుల ఈశ్వర్ రేసులో ఉన్నారు. కడియం శ్రీహరిని పార్లమెంటుకు పంపించి ఇతరులకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గత కేబినెట్ లో ఉన్న చందూలాల్ ఈసారి ఓడిపోవడంతో ఎస్టీ కోటాలో రెడ్యానాయక్ కి మాత్రం బెర్త్ కన్ ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి సామాజకవర్గాల లెక్కలతో ఎవరెవరికి కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది.