కేసీఆర్ స్టెప్ కాంగ్రెస్ కు బెస్ట్ అయిందా..?
పార్లమెంటు ఎన్నికలతో కలిసి అసెంబ్లీకి వెళ్లడం కంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలు చేస్తుందనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికల వైపు మొగ్గు చూపారు. ఎనిమిది నెలల పదవీకాలాన్ని వదులుకుని సెప్టెంబర్ 6న అసెంబ్లీని ఆయన రద్దు చేశారు. అయితే, కోర్టులు, కేసులు, ప్రజా తీర్పు అని చెప్పినా రాజకీయ ఉద్దేశ్యమే ముందస్తుకు కారణం అనేది అందరూ ఒప్పుకునేదే. పార్లమెంటు ఎన్నికల సమయం వరకు కాంగ్రెస్ బలపడే అవకాశం ఉండటం, జాతీయ అంశాలను ఎన్నికలను ప్రభావితం చేస్తాయనే ఆలోచనతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వాస్తవానికి, సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసే సమయానికి పరిస్థితి టీఆర్ఎస్ కు చాలా అనుకూలంగా ఉన్నట్లు కనిపించింది. అయితే, తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కాంగ్రెస్ కూడా బలం పుంజుకుంటోంది. ముందస్తు ఎన్నికలే కాంగ్రెస్ కి కొన్ని విషయాల్లో మేలు చేస్తున్నాయని అంటున్నారు.
తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
వాస్తవానికి సమయానికి ఎన్నికలు ఉంటే పార్లమెంటు ఎన్నికలతో సహా తెలంగాణ ఎన్నికలు జరిగాల్సి ఉంటుంది. అయితే, ముందస్తు కారణంగా ఆరునెలల ముందే ఎన్నికలు వచ్చాయి. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకూ ఎన్నికలు వచ్చాయి. గెలిచే అవకాశం ఉన్న తెలంగాణపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఎంపిక, పొత్తుల ఖరారు వంటి అంశాల్లో ఎప్పుడూ లేనంతగా కసరత్తు చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా అన్ని విషయాలను పర్యవేక్షించారు. ఇక అభ్యర్థుల ఎంపిక తర్వాత రెబెల్స్ విషయంలోనూ ఇదే జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ ని బుజ్జగించేందుకు పక్క రాష్ట్రాల నుంచి నేతలు, ఏఐసీసీ నేతలు కూడా రంగప్రవేశం చేశారు. రాత్రింబవళ్లు శ్రమించి ఇంచుమించు అందరు రెబెల్స్ ని నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. ఇందుకోసం ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్, జైరాం రమేష్ తో పాటు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీ.కే.శివకుమార్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి వంటివారు తెలంగాణలో మకాం వేశారు. కొందరు రెబెల్స్ ఇంటికి నేరుగా వెళ్లి బుజ్జగించారు. జాతీయ స్థాయి నేతలు, పక్క రాష్ట్రాల ముఖ్యనేతలు బుజ్జగించడంతో రెబెల్స్ పూర్తిగా చల్లబడ్డారు. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలు వచ్చి ఉంటే వీరంతా వారివారి రాష్ట్రాల్లో బిజీగా ఉండిపోయేవారు.
ముఖ్యనేతల ప్రచారానికి అవకాశం...
ఇక ప్రచారంపర్వంలోనూ కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికలు మేలు చేశాయి. రాహుల్ గాంధీ సుమారు 10 సభల్లో పాల్గొననున్నారు. ఇక 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. వారంతా రోజుకొకరు చొప్పున తెలంగాణలో పర్యటిస్తున్నారు. కొందరైతే హైదరాబాద్ లోనే తిష్ఠ వేశారు. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు వచ్చి ఉంటే మాత్రం ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేతలకు ఇంత అవకాశం దొరికి ఉండేది కాదు. రాహుల్ గాంధీకి సైతం అన్ని రాష్ట్రాలు తిరగాల్సిన బాధ్యత వల్ల రాష్ట్రంలో రెండు మూడు బహిరంగ సభలకు మించి సమావేశాలు పెట్టే అవకాశం ఉండేది కాదు. మహాకూటమిలోని టీడీపీకి కూడా ముందస్తు ఎన్నికలు మంచి అవకాశాన్ని కల్పించాయి. ఏపీలో ఎన్నికలు ఇంకా ఆరు నెలలు ఉన్నందున చంద్రబాబు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించారు. అభ్యర్థుల ఎంపిక, రెబెల్స్ బుజ్జగింపులు ఆయనే చూసుకున్నారు. ఇక ప్రచారానికి కూడా చంద్రబాబు ఎక్కువ సమయమే కేటాయించే అవకాశం ఉంది. మొత్తానికి తమకు కలిసి వస్తుందని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఈరకంగా అది కాంగ్రెస్ కి మేలు చేసిందనమాట.