కూటమి పగ్గాలు కోదండరాంకి..?
తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో కొట్లాటలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతులు ఎలా ఉన్నా మొత్తానికి రెండు నెలల్లో పదుల సమావేశాల తర్వాత నామినేషన్లు మొదలయ్యాక సీట్ల లెక్కలు తేలాయి. అయితే, టీజేఎస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. నిన్నటివరకు తెలంగాణ జన సమితి అధినేత ప్రొ.కోదండరాం పోటీ చేసే స్థానంపై చాలా ప్రచారం జరిగింది. మొదట రామంగుండం అని, తర్వాత మంచిర్యాలీ లేదా వరంగల్ వెస్ట్ నుంచి ఆయన పోటీ చేస్తారన్నారు. చివరగా జనగామ స్థానం నుంచి సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను తప్పించి కోదండరాంను నిలబెట్టాలనుకున్నారు. కానీ, అధిష్ఠానం వద్ద పొన్నాల తీవ్ర ప్రయత్నాలు చేసి సీటును కాపాడుకున్నారు. ఇక సీనియర్ బీసీ నేత అయిన పొన్నాల స్థానాన్ని తీసుకుని పోటీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని టీజేఎస్ కూడా భవించడంతో పొన్నాల టిక్కెట్ కన్ఫార్మ్ కాగా కోదండరాం పోటీ మాత్రం డైలమాలో పడింది.
ప్రచార బాధ్యతలూ ఆయనపైనే..?
శుక్రవారం సాయంత్రం టీజేఎస్ కార్యాలయానికి వెళ్లిన పీసీసీ ఇంఛార్జి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో భేటీ అయ్యారు. అయితే, మహాకూటమి సమన్వయకర్త బాధ్యతలు తీసుకోవాలని ఆయనను కోరారు. దీంతో పాటు రాష్ట్రం మొత్తం తిరిగి మహాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించాలని కోరారు. నేరుగా పోటీ చేస్తే ఆ నియోజకవర్గానికే ఎక్కువ సమయంలో కేటాయించాల్సి వచ్చే అవకావం ఉన్నందున పోటీకి దూరంగా ఉండి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేయాలనే ఆలోచన చేశారని తెలుస్తోంది. అయితే, మొదటి ఎన్నికల్లోనే పోటీకి దూరంగా ఉండటం కూడా సరైంది కాదు అని కొందరు సూచిస్తున్నారు. కానీ, రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాడానికి మాత్రం కోదండరాం సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఐకాస ఛైర్మన్ గా కోదండరాం ఉద్యమాన్ని ముందుండి నడిపారు. తెలంగాణ ప్రజల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన ప్రచారం చేస్తే కూటమికి చాలా మేలు జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల ఆయన రాహుల్ ను కలిసినప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. దీంతో కోదండరాం ప్రచార బాధ్యతలు తీసుకుని రాష్ట్రం మొత్తం తిరిగడం మాత్రం ఖాయం అంటున్నారు.
అధికారంలోకి వచ్చాక కూడా....
ఇక మహాకూటమి అధికారంలోకి వస్తే కోదండరాంకి కీలక బాధ్యతలు అప్పగిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటు చేసే కామన్ మినిమం అజెండా అమలు చేసేందుకు ప్రత్యేకం చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ గా కోదండరాం ను నియమించాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ చేస్తోంది. విద్యార్థి దశ నుండే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కోదండరాంకి ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ పరిస్థితులు, ప్రజల స్థితిగతులు, సమస్యలపై మంచి అవగాహన ఉంది. మహాకూటమి ఏర్పాటుకు కూడా ఆయన కామన్ మినిమమ్ అజెండా కచ్చితంగా ఉండాల్సిందే అని షరతు పెట్టారు. అన్ని అంశాల్లో అవగాహన ఉండటంతో పాటు ప్రజల్లో గౌరవం ఉన్న కోదండరాంకి ఈ బాధ్యతలు ఇస్తామని ఎన్నికల ముందే ప్రకటించాలని ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీకి కోదండరాం దూరమైనా ప్రచారంలో... ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.