పట్నంకు గడ్డు పరిస్థితేనా..?
తెలంగాణలో మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలపై ఆసక్తి నెలకొంది. ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి మూడు పర్యాయాలు విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పైలట్ రోహిత్ రెడ్డిని బరిలో నిలిపింది. దీంతో ఇక్కడ ద్విముఖ పోటీ ఉండనుంది. గెలుపుపై ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాండూరులో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని, అభ్యర్థుల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం.
గెలుపు ధీమాతో మహేందర్ రెడ్డి
మహేందర్ రెడ్డికి తాండూరు నియోజకవర్గంలో బాగా బలముంది. ఆయన భార్య జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. ఆయన తమ్ముడు నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. మొత్తానికి రాజకీయంగా బలమైన కుటుంబం వారిది. 1994, 2009, 2014 ఎన్నికల్లో మహేందర్ రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావుపై సుమారు 16 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన గత ఎన్నికల ముందే టీఆర్ఎస్ లో చేరి విజయం సాధించి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తాండూరు నియోజకవర్గంలో బీసీల ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా ముదిరాజ్ లు, యాదవులు ఎన్నికల్లో గెలుపోటములపై ప్రభావం చూపే స్థాయిలో ఉన్నారు. వీరు ప్రభుత్వ పథకాల పట్ల సానుకూలంగా ఉన్నందున టీఆర్ఎస్ వైపు ఉంటారని ఆ పార్టీ ధీమాగా ఉంది. మంత్రిగా నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ది పనులు చేపట్టినా, నియోజకవర్గం ఇంకా ఆశించిన అభివృద్ధి మాత్రం జరగలేదు. తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర, ఉద్యమకారుల్లో అసంతృప్తి మహేందర్ రెడ్డికి మైనస్ కానున్నాయి. వరుసగా రెండు పర్యాయాలు విజయం సాధించడంతో సహజంగానే కొంత వ్యతిరేకత ఏర్పాడే అవకాశం కూడా ఉంది.
గట్టి పోటీ ఇస్తున్న పైలట్....
ఇక కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో పైలట్ రోహిత్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఆయనకు ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం దక్కలేదు. పార్టీ టిక్కెట్ దక్కని వారు ఆయనకు సహకరించడం లేదు. రోహిత్ రెడ్డి 2009 ఎన్నికల సమయంలోనే రాజకీయ ప్రవేశం చేసినా టిక్కెట్ దక్కలేదు. అయినా ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. యంగ్ లీడర్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున యువతలో పట్టు సాధించారు. పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడంతో నియోజకవర్గంలో మంచి పేరే సంపాదించారు. మంత్రి వ్యతిరేకతలు, వికారాబాద్ ను గద్వాల జోన్ లో కలపడం, కాలుష్యం వంటి అంశాలను ఎన్నికల ప్రచారానికి బాగానే ఉపయోగించుకున్నారు. అయితే, బీసీలకు వ్యతిరేకంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని ఇటీవల బాగా హైలెట్ అయ్యింది. ఇది ప్రజల్లోకి వెళ్లింది. కానీ, తన నుంచి బీసీలను దూరం చేసేందుకు కుట్ర పన్నారని రోహిత్ ఆరోపించారు. అయినా, కొంత బీసీల్లో మాత్రం వ్యతిరేక భావన ఏర్పడింది. ఇక, మహేందర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తాండూరు స్థానాన్ని కీలకంగా తీసుకున్నారు. ఆయన టీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆయన పూర్తిగా నియోజకవర్గంపై దృష్టి సారించి పైలట్ విజయానికి కృషి చేస్తున్నారు. మొత్తానికి రోహిత్ రెడ్డి... మహేందర్ రెడ్డికి గట్టి పోటీనే ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మహేందర్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక అయితే కాదు.