మునుగోడు ఎవరిని ముంచుతోంది...?
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటిది. అయితే, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కూడా సగం స్థానాలు గెలిచి బలం చూపింది. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నల్గొండ జిల్లాపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడంతో పాటు కాంగ్రెస్ ముఖ్యులు పోటీ చేస్తున్న స్థానాలను కూడా చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ సీట్లను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. వాస్తవానికి ఆయనకు ఎమ్మెల్సీగా ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉన్నా అసెంబ్లీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 38 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన మరోసారి బరిలో నిలిచి రెండు నెలలుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక బీజేపీ నుంచి మనోహర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో సుమారు 27 వేల ఓట్లు సాధించడంతో ఆయన కూడా గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నారు.
గెలుపుపై ధీమాగా ఉన్న కూసుకుంట్ల
రెండేళ్ల నుంచే మునుగోడులో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రాజగోపాల్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుని క్యాడర్ ను పెంచుకున్నారు. ఇక్కడి నుంచి సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి టిక్కెట్ ఆశించారు. ఆమె గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్ గా పోటీ చేసి 27 వేల ఓట్లు సాధించింది. గోవర్ధన్ రెడ్డికి ఇక్కడ మంచి పట్టు ఉండేది. ఆయన గతంలో ఐదుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల్లో స్రవంతికి కాకుండా కోమటిరెడ్డికి టిక్కెట్ దక్కడంతో ఆమె వర్గం అసంతృప్తితో ఉంది. వారిని కలుపుకునిపోయేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధిలో మంచి మర్కులే పడ్డాయి. నియోజకవర్గంలో మౌళిక సధుపాయాల కల్పనకు ఆయన పెద్ద పీట వేశారు. ఇక ప్రభుత్వ పథకాలను ప్రజల సానుకూలత కూడా తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఆయనకు బలమైన ప్రత్యర్థి లేక భారీ మెజారిటీ దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
సీపీఐ బలం కూడా కలవడంతో...
ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడులో మంచి పట్టు సంపాదించుకున్నారు. అంగ, అర్థబలం దండిగా ఉన్న ఆయన కూసుకుంట్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. టిక్కెట్ దక్కిందే మొదలు ఆయన నియోజకవర్గంలో మండలాలవారీగా కార్యకర్తల సమావేశాలు, రోడ్ షోల ద్వారా బలం చాటుకుంటున్నారు. ఇక సీపీఐతో పొత్తు రాజగోపాల్ రెడ్డికి కచ్చితంగా కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఐదుసార్లు సీపీఐ గెలిచింది. 2004, 2009లోనూ ఇక్కడ సీపీఐ ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం 20 వేల ఓటు బ్యాంకు ఆ పార్టీకి ఉందనే అంచనాలు ఉన్నాయి. అందుకే సీపీఐ ఈ స్థానం కావాలని పట్టుబట్టింది. అయితే, రాజగోపాల్ రెడ్డి సీపీఐని పూర్తిస్థాయిలో కలుపుకుని పోతుండటం కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి కూడా భారీగానే ఓట్లు సాధించే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి ప్రభాకర్ రెడ్డికి కోమటిరెడ్డి గట్టి పోటీ ఇస్తుండటంతో ఆయన విజయం కష్టంగా మారింది.