నల్లారి ఇలా ఉపయోగపడతారా.... ??
ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాల్లో తలమానికంగా నిలిచి మూడు జిల్లాలను శాసించిన దివంగత నేత ద్రోణం రాజు సత్యనారాయణ 87వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 19న జరిగే ఈ వేడుకలకు ఏపీవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులను పిలవాలని నిర్ణయించారు. ఆ విధంగా పెద్దాయన పేరు మీద భారీ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తున్నారు. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తున్నందున పార్టీ ఉనికిని ఈ విధంగా బలంగా చాటాలని కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు.
మాజీ సీఎం రాక....
ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తరువాత నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. ఈ మధ్యన కాంగ్రెస్ లో ఆయన చేరారు. అయితే ఆయన ఇంతవరకూ ఎక్కడా ఏపీలో తిరిగిన దాఖలాలు లేవు. ద్రోణం రాజు జయంతి వేళ ఆయన విశాఖ వస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా తొలిసారి ఈ ప్రాంతానికి రావడం ఓ విధంగా కాంగ్రెస్ లో ఆసక్తిని పెంచే అంశం. పైగా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డిని వాడుకోవాలని కాంగ్రెస్ ఈ విధంగా తీసుకువస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే విధంగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ కూడా హాజరవుతున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టాక మూడు నెలల క్రితం ఇక్కడకు వచ్చి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పర్యటనలు చేసారు. మరి ఇపుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో అయన రావడం కూడా వ్యూహంలో భాగమేనని అంటున్నారు.
టీడీపీతో పొత్తు నేపధ్యమేనా?
తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదురుతుందని భావిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పెద్దలు ఉత్తరాంధ్ర మీద గురి పెట్టడం రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది. కాంగ్రెస్ లో ఇపుడు పెద్ద తలకాయలు ఎవరూ లేరు. విశాఖలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్, శ్రీకాకుళం లో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వంటి వారు తప్ప ఎవరూ కనిపించడంలేదు. ఈ పరిస్తితుల్లో పార్టీ బలాన్ని చూపించడం ద్వారా నాయకులను వెనక్కు తీసుకురావాలని అనుకుంటున్నారు. అదే సమయంలో రేపటి పొత్తులు కూడా ఖరారు అయితే ఎక్కువ సీట్లు కూడా ఈ ప్రాంతాల్లో తీసుకుని హస్తం పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే గత కాలం పెద్దలను చూపించి రేపటి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ బాటలు వేస్తుకోవాలనుకుంటోంది. అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
- Tags
- andhra pradesh
- ap politics
- dronamraju satyanarayana
- janasena party
- nallari kirankumarreddy
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- umen chandi
- visakhapatnam district
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఉమెన్ చాందీ
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- ద్రోణంరాజు సత్యనారాయణ
- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- విశాఖపట్నం జిల్లా
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ