కడప...ఇలా అయిపోయిందేంటి బాబూ...!
కడప జిల్లాలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చంద్రబాబు గత నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి తన పార్టీలోకి చేర్చుకుని మరీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అదే జిల్లాకు చెందిన సీఎం రమేష్ కు మరోసారి రాజ్యసభ పదవిని ఇచ్చారు. ఇక పులివెందులకు నీళ్లిచ్చామని, వచ్చే ఎన్నికల్లో జగన్ కంచుకోటను బద్దలు కొట్టడం ఖాయమని చంద్రబాబు గట్టిగా అనుకుంటున్నారు. కాని చంద్రబాబు ఆశలు నెరవేరేటట్లు లేదు. కడప జిల్లాలో గ్రూపు రాజకీయాలకు తక్కువలేదు. గతఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు వచ్చినా....అధికారంలోకి రావడంతో పెత్తనరాయుళ్లు ఎక్కువయిపోయారు.
ప్రతి నియోజకవర్గంలో......
కడప జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్నా తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు మామూలుగా లేవు. రోడ్డున పడి మరీ కొట్లాడుకుంటున్నారు. చంద్రబాబు ఎన్ని హితబోధలు చేసినా సరే. అవి షరా మళ్లీ మామూలే. మొన్నటికి మొన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్షకు దిగిన సీఎం రమేష్ చేత దీక్ష విరమింప చేసేందుకు కడప జిల్లాకు వెళ్లిన చంద్రబాబు నేతలకు గట్టిగానే క్లాస్ పీకారు. సీఎం రమేష్ దీక్షకు కూడా కొందరు నేతలు దూరంగా ఉండటాన్ని తప్పుపట్టారు. కడప స్టీల్ ఫ్యాక్టరీపై ఆందోళన పార్టీకి మైలేజీ తెస్తుందని, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే పులివెందులలో సయితం జెండా ఎగురవేయగలమని వారికి ధైర్యాన్ని నూరిపోశారు.
నెల తిరక్కుండానే.....
కాని నెల తిరక్కుండానే పరిస్థితి మామూలయి పోయింది. గత ఎన్నికల్లో కడప జిల్లాలో గెలిచిన ఒకే ఒక్కడు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పార్టీని వీడి వెళ్లిపోతారనడంతో అధిష్టానం కంగుతినింది. మేడా వైసీపీలోకి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలోకి వెళితే పార్టీ పరువు బజారున పడుతుంది. అందుకోసం హుటాహుటిన ఆయనను సచివాలయానికి రప్పించి నేరుగా చంద్రబాబు చర్చలు జరిపారు. దీంతో మేడా తన సోదరుడి ఒత్తిడి వల్లనే వైసీపీలోకి వెళ్దామనుకుని చెప్పానని చెప్పడం హాస్యాస్పదంగానే కన్పించింది.
గ్రూపు విభేదాలతో......
ఇక జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ప్రొద్డుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సీఎం రమేష్ ను వరుసగా టార్గెట్ చేశారు. అంతేకాదు పార్జీ పరువు తీసేలా సీఎం రమేష్ చేస్తున్న అవినీతిని రెండు రోజులుగా బయటపెడుతున్నారు. దీనిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. ఇక బద్వేలులోనే అంతే. జమ్మలమడుగు గురించి వేరే చెప్పనవసరం లేదు. ఇలా కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి...వీధుల్లోకి వస్తుండటంతో అధినేతలో ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలోనే కడప జిల్లాలో పర్యటించి నేతల మధ్య సమన్వయం ఉండేలా చూసేందుకు చంద్రబాబు బయలుదేరుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
- Tags
- adinarayana reddy
- andhra pradesh
- ap politics
- cm ramesh
- janasena party
- kadapa district
- nara chandrababu naidu
- pawan kalyan
- ramasubbareddy
- telugudesam party
- varadarajulu reddy
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆదినారాయణరెడ్డి
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కడప జిల్లా
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- రామసుబ్బారెడ్డి
- వరదరాజులు రెడ్డి
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- సీఎం రమేష్