చినబాబూ...చిచ్చు పెట్టావు కదయ్యా...?
కర్నూలు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార తెలుగుదేశం పార్టీలో గ్రూపు విభేదాలు మరింత ముదిరే అవకాశం ఏర్పడింది. ఇందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ అని చెప్పక తప్పదు. నారా లోకేష్ రెండు రోజుల పర్యటన నిమిత్తం కర్నూలు జిల్లాకు వచ్చారు. ఆయన రాక సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. ఘనంగా స్వాగతం పలికారు. అయితే కర్నూలు సిటీ సీటు కోసం రెండు వర్గాలు గట్టిగా పోటీ పడుతున్నాయి. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్.
ఇద్దరూ పోటాపోటీగా.....
కర్నూలు జిల్లా పర్యటనకు సోమవారం వచ్చిన మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పెద్ద ర్యాలీతో స్వాగతం పలికారు. తన అనుచరులతో ఆయన దారి పొడవునా లోకేష్ కు జేజేలు కొట్టించారు. లోకేష్ పై పూలవర్షం కురిపించారు. ఇక టీజీ వెంకటేశ్ మాత్రం ఊరుకుంటారా? ఆయన ఎస్వీని తలదన్నే రీతిలో లోకేష్ కు స్వాగతం పలికేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. అతి పెద్ద గజమాలను తయారు చేయించి క్రేన్ సాయంతో లోకేష్ మెడలో వేసి చినబాబును ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
సిటీ సీటు కోసం....
కర్నూలు సిటీ సీటు కోసం ఈ రెండు వర్గాలు గతకొంతకాలంగా బహిరంగంగానే పోటీపడుతున్నాయి. వాస్తవానికి కర్నూలు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఎస్వీ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత తన బావ భూమా నాగిరెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకోవడంతో ఆయన వెనకే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చారు. ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరనంత వరకూ కర్నూలు సిటీలో టీడీపీ కార్యక్రమాలను టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ చూస్తుండేవారు. కర్నూలు సిటీలో టీజీ కుటుంబానికి పట్టు ఉండటంతో తెలుగుదేశం అధిష్టానం కూడా టీజీ భరత్ ను ప్రోత్సహించింది. తనయుడిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని టీజీ కూడా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వెళుతున్నారు.
లోకేష్ పర్యటనతో....
ఈ నేపథ్యంలో గతకొంతకాలంగా టీజీ వెంకటేశ్, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలయింది. టీజీ వెంకటేశ్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది ఓపీనియన్ పోల్ సోషల్ మీడియాలో నిర్వహించారంటూ ఎస్వీ మోహన్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కూడా. ఈ సమయంలో కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన నారాలోకేష్ వచ్చే ఎన్నికల్లోనూ ఎస్వీ మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునివ్వడంతో టీజీ వర్గం డల్ అయింది. అలా ముందుగానే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని, తెలుగుదేశం పార్టీలో కొత్త సంప్రదాయానికి నారా లోకేష్ తెరతీశారని టీజీ వర్గం భగ్గుమంటోంది. ఇలా లోకేష్ పర్యటనతో కర్నూలు పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమనే అవకాశముంది. అయితే లోకేష్ ఈ వ్యాఖ్యలు ఫ్లో లో చేశారా? లేక కావాలనే చేశారా? అన్న చర్చ కూడా బయలుదేరింది.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- butta renuka
- janasena party
- kurnool
- nara chandrababu naidu
- nara lokesh
- narendra modi
- pavan kalyan
- prajasankalpa padayathra
- s.v.mohan reddy
- t.g.venkatesh
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఎస్వీ మోహన్ రెడ్డి
- ఏపీ పాలిటిక్స్
- కర్నూలు
- జనసేన పార్టీ
- టీజీ వెంకటేశ్
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- నారా లోకేష్
- పవన్ కల్యాణ్
- బుట్టా రేణుక
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ